వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం, మంత్రులకు నిరసన సెగ

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగలింది. బాధితులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బాధితుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. మూడు రోజులుగా తిండీతిప్పల్లేకుండా, వరద నీటిలో బిక్కుబిక్కుమని గడుపుతుంటే తీరిగ్గా వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులపై బాధితులు విరుచుకుపడ్డారు. 
 
బాధిత కుటుంబాలకు రూ. 10 వేలు సాయం అందిస్తామని సీఎం చెప్పగానే వారిలో ఆగ్రహం మరింతగా కట్టలు తెంచుకుంది. ‘మీరిచ్చే రూ. 10 వేలు వద్దు.. మీరూ వద్దు.. ఆ పది వేలకు ఒక్క సామాను కూడా రాదు’ అంటూ ఖమ్మం మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌ ముఖం మీదే తేల్చి చెప్పారు.
 
‘వరద నీటిలో చిక్కుకొని రెండు రోజులుగా నరకం అనుభవిస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదని, అన్నపానీయాలు లేకుండా మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘మాకు ఈ ప్రకటనలు, హామీలు వద్దు.. సాయం చేయండి’ అంటూ డిమాండ్‌ చేశారు. 
 
భారీ వర్షాల కారణంగా శని, ఆదివారాల్లో ఖమ్మంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలను ముంచేసింది. వరద నీటిలో చిక్కుకొని నరకం చూసిన ప్రజలను పరామర్శించేందుకు, జరిగిన నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఖమ్మం వచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు నీటమునిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితుల బాగోగుల గురించి అడిగి తెలుసుకోబోయారు. 
 
ఈ క్రమంలో రెండు రోజులుగా ఆచూకీలేని ప్రభుత్వ పెద్దలు సోమవారం పరామర్శకు రావడంపై బాధితులు భగ్గుమన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలో మహిళలు నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి ఎదుటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో ఆయన పర్యటనను నిరసిస్తూ వ్యర్థాలను రోడ్డుపై పోయించి నిరసన వ్యక్తం చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం రూరల్‌ మండలంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన ఎదురైంది. మండలంలోని పోలేపల్లి రాజీవ్‌ గృహకల్ప కాలనీలో సీఎం పర్యటిస్తున్న సమయంలో స్థానికులు అడుగడుగునా అడ్డుతగిలారు. మంత్రి పొంగులేటి తమ కాలనీకి వచ్చి తమ కష్టాన్ని చూడాలంటూ ఉదయం 8 గంటల సమయంలో ఖమ్మం బైపాస్‌పై సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. 

పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు రేవంత్‌ అదే కాలనీకి వెళ్లాల్సి ఉంది. దీంతో కాలినడకన వచ్చిన తమ ఇండ్లలోని పరిస్థితిని చూస్తారని కాలనీవాసులు ఆశపడ్డారు. కానీ సీఎం కాలినడక కాకుండా ఓపెన్‌టాప్‌ జీప్‌లో వచ్చారు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి కారులో ఉండి హాయ్‌ చెప్పడానికి ఇక్కడకు వచ్చారా? అని మండిపడ్డారు.