వందేభారత్​ ‘స్లీపర్​ ట్రైన్​’ త్వరలోనే పట్టాలపైకి

వందేభారత్​ ‘స్లీపర్​ ట్రైన్​’ త్వరలోనే పట్టాలపైకి
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ రైలు త్వరలోనే పట్టాలక్కెనున్నది. త్వరలోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌లోని ఫెసిలిటీలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రోటోటైప్‌ని ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రైలు ట్రయల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పదిరోజుల పాటు ట్రయల్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. వందే భారత్‌ చైర్‌కార్‌ తర్వాత వందే భారత్‌ స్లీపర్ వెర్షన్‌పై పని చేస్తున్నామని తెలిపారు. రైలు పూర్తిస్థాయిలో సిద్ధమైందని, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ ఫెసిలిటీ నుంచి ట్రయల్‌, టెస్టింగ్‌ కోసం బయలుదేరుతుందని తెలిపారు.
 
ఈ సందర్భంగా స్లీపర్‌ రైలు కోచ్‌ను పరిశీలించారు. రైలు తయారీలో పాల్గొన్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. వచ్చే మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని వైష్ణవ్ ప్రకటించారు. ప్రోటోటైప్ రైలును పరీక్షించిన అనంతరం ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 
ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ప్రతి నెలా రెండు నుంచి మూడు రైళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాయని వెల్లడించారు.
వందే భారత్‌ రైలు డిజైన్‌ను నిరంతరం మెరుగుపరుస్తున్నామని, అనుభవం నుంచి నేర్చుకుంటూ మెరుగులుదిద్దుతున్నామని చెప్పారు.  వందే భారత్ స్లీపర్ వెర్షన్ 800 నుంచి 1200 కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణాల కోసం రైల్వేశాఖ తీర్చిదిద్దింది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 ఏసీ త్రీటైర్‌, నాలుగు ఏసీ టూ టైర్‌, ఒక ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ సహా 823 బెర్త్‌లు ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
 
భద్రతతో పాటు, స్లీపర్ వెర్షన్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌, మాడ్యులర్ ప్యాంట్రీలు, వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, టాయిలెట్‌ తదితర ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉండనున్నాయి. మొదటి ఏసీ కోచ్‌లో వేడినీటితో కూడిన షవర్లు సైతం ఉంటాయి. 
 
సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచనున్నాయి. మధ్యతరగతి కోసం ఉద్దేశించిన రైలన, ఛార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు సౌకర్యవంతమైన, సరసమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ల్లో రీడింగ్‌ ల్యాంప్స్‌, ఛార్జింగ్‌ అవుట్‌లెట్‌లు, స్నాక్‌ టేబుల్, మొబైల్‌-మ్యాగజైన్‌ పెట్టుకునే సదుపాయాలు ఉంటాయి. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్‌’ వ్యవస్థ ఉంటుంది. అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కార్‌ బాడీతో ఉంటాయి. జీఎఫ్ఆర్​పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో టాయిలెట్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో అమర్చారు.