ఆర్ధిక సంక్షోభంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు

దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. అధికారంకోసం ఎన్నికల సమయంలో ఇష్టమైనరీతిలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు పరచలేక నానా అవస్థలు పడుతున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో దాదాపు ఒకే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

దానితో ఎడాపెడా అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పలు రకాల చార్జీలు, పన్నుల భారం మోపక కాంగ్రెస్ ప్రభుత్వాలకు తప్పడం లేదు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో కనీసం వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనతో పాటు మంత్రులు, నామినేట్ పదవులలో కాబినెట్ హోదాలో ఉన్నవారు రెండు నెలల పాటు వేతనాలు, టీఏ, డీఏ వంటివి తీసుకోకూడదని క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని ప్రకటించారు. పైగా, రాష్ట్రంలోని శాసనసభ్యులు కూడా ఇదే విధంగా చేయాలని అభ్యర్థించారు.

కనీసం వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో హిమాచల్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారి విమర్శించారు. సీఎం తనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎమ్మెల్యేలకు వేతనాలు ఇచ్చుకోలేనంతగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఎద్దేవా చేశారు. 

ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ‘ఖటా-ఖట్‌’ మాడల్‌ కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఆయన విఫల ఆర్థిక ఆలోచనా విధానాలు బహిర్గతమయ్యాయని  ఆయన విమర్శించారు. కర్ణాటకలో కూడా ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయని, పాల నుంచి నీళ్ల వరకు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయని ధ్వజమెత్తారు. నకిలీవాగ్దానాలు చేసిన రాహుల్‌ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను నమ్మి ఓటేసిన ప్రజలకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ చుక్కలు చూపిస్తున్నది. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. గ్యారెంటీలకు అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. దీనికితోడుగా పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ను 4 శాతం పెంచడంతో పాటు పలు రకాల పన్నులు, చార్జీలతో ప్రజలపై భారం వేస్తున్నది. 

‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఇక తెలంగాణలో అయితే గ్యారెంటీల అమలులో ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ ప్రభుత్వం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌ కేవలం 8 నెలల్లోనే రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఒక్క కొత్త ప్రాజెక్టూ లేక, మరోవైపు ప్రజా సంక్షేమమూ లేక తెచ్చిన వేలాది కోట్ల అప్పులు ఎటు పోతున్నాయో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 

రుణమాఫీ అంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగ ఊదరగొట్టిన కాంగ్రెస్‌ రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేక రైతన్నల ఆగ్రహాన్ని చవిచూస్తున్నది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత రోడ్లెక్కుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.