
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడంపై దిగ్భ్రాంతికరమైన అంశాలను వెల్లడించిన జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ అందుకు నైతిక బాధ్యత వహిస్తూ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు.
ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ‘అమ్మ’ సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు నెలల క్రితమే వీరు పదవీ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. కమిటీలోని కొంతమంది సభ్యులపైననే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, అందులో భాగంగానే నైతిక బాధ్యతగా వీళ్లందరూ ఇప్పుడు రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఈ మూకుమ్మడి రాజీనామాల వల్ల మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పాలక మండలిని రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ‘అమ్మ’ సంఘానికి మోహన్‌లాల్ అధ్యక్షత వహించగా, నటులు జయన్ చేర్తలా, జగదీశ్, బాబురాజ్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్, కళాభవన్ షాజన్ తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
అయితే జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత డైరెక్టర్ రంజిత్, నటులు సిద్ధిఖీ, జయసూర్య, బాబురాజ్, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి ఇటీవలే రాజీనామా చేశారు.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం