
నిబంధనలకు విరుద్ధంగా ఖర్గే కుటుంబ సభ్యులకు భూ కేటాయింపులు జరిపారని బీజేపీ భగ్గుమంటోంది. కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక్ ఖర్గేను బర్తరఫ్ చేయాలని, ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్‌ను కోరారు.
ఇక్కడ స్థలం కోసం అనేక సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి ఖర్గేకు చెందిన ట్రస్టుకు కేటాయించిందని, ఇది కుంభకోణమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మూడేండ్ల కిందట కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉండగా భూముల కేటాయింపులో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నానా రాద్ధాంతం చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారీ భూదందాకు తెరలేపిందని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ఆరోపించారు. 3677 ఎకరాల భూమిని ఎకరాకు కేవలం రూ. 1.22 లక్షలకు కట్టబెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారని పేర్కొన్నారు.
కర్ణాటక సీఎం అనుసరించే సోషలిజం అంటే పేదల నుంచి భూములు గుంజుకుని వాటిని పెద్దలకు కట్టబెట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ మార్కెట్ రేటు ప్రకారం ఎకరం కనీసం రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్, ఆ పార్టీ హైకమాండ్ కారుచౌకగా భూములు కట్టబెడుతూ భారీ ముడుపులు అందుకుంటున్నాయని తన సందేహమని సీటీ రవి ఆరోపించారు.
కాగా, భూ ఆక్రమణల్లో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు ఇదే తొలిసారి కాదని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పైనా భూముల విషయంలో ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇవాళ రాజ్యసభలో విపక్ష నేత ఖర్గేపైనా కర్నాటకలో ఇవే ఆరోపణలు వస్తున్నాయని, ఢిల్లీలో రాబర్ట్ వాధ్రాపై సైతం భూ కబ్జా ఆరోపణలున్నాయని చెప్పారు. ఈ ఆరోపణలను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయనే విశ్వాసం తనకుందని తెలిపారు.
అయితే, బెంగళూర్‌కు సమీపంలోని ఏరోస్పేస్ పార్క్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ప్లాట్ కేటాయించడంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అధికారులు నిబంధనల మేరకే సదరు ట్రస్ట్‌కు భూమి కేటాయించారని, అర్హతలు, విధి, విధానాలను అనుసరించారని తెలిపారు. పైగా,నిబంధనలకు విరుద్ధంగా కాషాయ పాలకులు చాణక్య యూనివర్సిటీకి భూములు కేటాయించారని ఆయన ఆరోపించారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!