భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అందరూ ఊహించినట్టగానే ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా చైర్మన్ పదవికి ఎంపికయ్యాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు చైర్మన్ అయిన అతి పిన్న వయస్కుడి (35ఏండ్లు)గా షా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్‌క్లే స్థానంలో 2024, డిసెంబర్ 1న నూతన చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఐసీసీ చైర్మన్‌గా నామినేట్ అవ్వడంపై షా సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ‘ఐసీసీ చైర్మన్‌గా నామినేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐసీసీ బృందం, సభ్య దేశాలతో కలిసి క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కట్టుబడి ఉంటాను. క్రికెట్‌లోని ఫార్మాట్ల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసేందుకు అవసరమైతే సరికొత్త సాంకేతికతను అందుబాటలోకి తెస్తాం. ఇదివరకూ లేనంతగా క్రికెట్‌ను అంతటా విస్తరింపచేయడమే మా లక్ష్యం’ అని తెలిపారు.
2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం ఈ ఆట అభివృద్ది పరంగా గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం అని చెబుతూ దాంతో, క్రికెట్ మరింత పురోగతి చెందుతుందనే నమ్మకం తనకుందని షా వెల్లడించాడు.
బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా కుమారుడైన జై షా 2019 అక్టోబర్‌లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నాడు. 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గానూ షా సేవలందిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన నేపథ్యంలో తదుపరి బీసీసీఐ సెక్రటరీ ఎవరు? ఏసీసీ చైర్మన్ అయ్యేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
గ్రెగ్ బార్‌క్లే పదవీ కాలం నవంబర్‌లో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్న గ్రెగ్ ఇక వైదొలగాలని భావిస్తున్నాడు. అందువల్ల కొత్త బాస్ ఎంపిక అనివార్యమైంది. ఐసీసీ చైర్మన్‍గా ఎన్నికైన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో జగ్‍మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-2012), ఎన్ శ్రీనివాసన్ (2014-2015), శశాంక్ మనోహర్ (2015-2020) ఐసీసీ చైర్మన్‍గా విధులు నిర్వర్తించారు.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్‌లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు