సెప్టెంబర్ నుంచి దేశంలో జనగణన!

సెప్టెంబర్ నుంచి దేశంలో జనగణన!
దేశంలో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. పదేళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2021లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు.
దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు.  తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో ప్రారంభమైతే కొత్త సర్వే పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి. ప్రధాని కార్యాలయం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉందని వెల్లడించాయి.
జన గణనను చేపట్టే కేంద్ర హోంశాఖ, కేంద్ర గణాంకాల శాఖలు కాల పరిమితిని నిర్ణయించాయని 2026 మార్చి నాటికి 15 సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ అధికారులు తెలిపారు. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, గణాంకాల శాఖ నుంచి ఎటువంటి ధ్రువీకరణ రాలేదు. 

జనగణన, జాతీయ జనాభా నమోదు (ఎన్ పి ఆర్) ప్రక్రియ కోసం ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1,309.46 కోట్లను కేటాయించారు. మూడేళ్ల క్రితం నాటి కేటాయింపులతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే. 2021-2022లో జన గణనకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు.

ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సమాచారం. గత ఏడాది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా విషయంలో చైనాను భారత్‌ అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. 

1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. 2026 మార్చిలో ప్రభుత్వ గణాంకాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రధానమంత్రి కార్యాలయం తుది అనుమతులు రాగానే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.