* విచారణ జరపనున్న ఎన్‌సీపీసీఆర్, సిట్
తల్లిదండ్రుల కథనం ప్రకారం బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులు (మూడేండ్లు, నాలుగేండ్ల వయస్సు) ఆగస్టు 13న టాయిలెట్‌కు వెళ్లగా, అక్కడే స్వీపర్‌గా పని చేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆగస్టు 16న వీరిలో ఓ చిన్నారి తనకు ప్రైవేటు భాగాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది.
దాంతో ఆరా తీయగా, మరో చిన్నారికి కూడా అలా జరిగిందని తెలియడంతో ఇద్దరు చిన్నారులను స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా వారిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్యులు చెప్పారు. దీంతోపోలీసులకు ఫిర్యాదు చేయగా ఆగస్టు 17న నిందితుడు అక్షయ్ షిండేను అరెస్టు చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుడిపై, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి పాల్పడి వస్తువులు ధ్వంసం చేశారు.
తర్వాత పక్కనే ఉన్న బద్లాపూర్ రైల్వే స్టేషన్‌పైనా రాళ్లు రువ్వారు. స్టేషన్‌లోకి ప్రవేశించి పట్టాలపై కూర్చొని రైల్ రోకో నిర్వహించారు. దీంతో 30 లోకల్ రైళ్లు రద్దయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 12 రైళ్లను దారి మళ్లించారు. చాలా రైళ్లు ఆలస్యమయ్యాయి.
ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడంతో బద్లాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్‌తో పాటు ఓ మహిళా సహాయకురాలిని విధుల నుంచి తొలగించినట్టు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
బద్లాపూర్ ఘటనపై బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) స్పందించింది. కేసులో పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనుంగో తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి ఆర్తి సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది.
కేసును ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. కాగా, ఈ పాఠశాల బీజేపీకి చెందిన వ్యక్తిదని తనకు తెలిసిందని, అయినా రాజకీయాలు చేయదల్చుకోలేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి