ఇక సికింద్రాబాద్‌ నుంచి గోవాకు నేరుగా రైళ్లు

ఇక సికింద్రాబాద్‌ నుంచి గోవాకు నేరుగా రైళ్లు
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి గోవాకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలోనో, విమానాల్లోనో  వెళ్లాల్సి వచ్చేది. నేరుగా రైలు లేకపోవడంతో ఉన్న రైలు కూడా గుంతకల్లులో బోగీలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుండటంతో గోవా ప్రయాణం ప్రహసనంగా ఉండేది.

సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలు సర్వీసును ఈ వారం అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీసుగా కాచిగూడ నుంచి నాలుగు బోగీలను వాస్కో రైలుకు కలుపుతున్నారు. వీటిలో రెండు సాధారణ బోగీలు, ఏసీ, స్లీపర్ బోగీలను గుంతకల్లులో గోవా రైలుతో కలిపే వారు.

ఇకపై ప్రతి బుధవారం, శుక్ర వారాం సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు డైరెక్ట్‌ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. గురువారం, శనివారాల్లో వాస్కోడిగామా, మాడ్గవ్‌ నుంచి సికింద్రా బాద్‌ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. టిక్కెట్ ధరలను అధికా రులు త్వరలో ఖరారు చేస్తారు. ఏపీ ప్రయాణికులు కూడా ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకునేలా కనెక్టివిటీ కోసం టైమ్ టేబుల్ రూపొందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాయడంతో రైల్వేశాఖ స్పందించింది. ఈ వారంలో డైరెక్ట్ సర్వీసును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా దేశంలో 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 15-20లక్షల మంది గోవాకు వెళుతుంటారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు రైలు మార్గంలో వెళ్లాలంటే హౌరా వాస్కోడిగామా రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. లేదంటే విజయవాడ నుంచి గుంతకల్లు మీదుగా హుబ్లీ వరకు వెళ్లి అక్కడి నుంచి మరో రైల్లో వాస్కోడిగామా చేరుకోవాల్సి వచ్చేది. హౌరా-వాస్కో రైల్లో బెర్తులు లభించడం అంత సులువు కాదు. విజయవాడ నుంచి బయల్దేరే అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో హుబ్లీ వరకు ప్రయాణానికి 16 గంటల పైనే పడుతుంది. అక్కడి నుంచి వాస్కో, మాడ్గవ్ వంటి స్టేషన్లకు మరో మూడు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది.

ఇక హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లాలనుకునేవారికి ప్రయాణం మరింత కష్టంగా ఉంటుంది. కనెక్టింగ్ రైల్లో వెళ్లడం కంటే నైట్ స్లీపర్ బస్సుల్లో గోవా ప్రయాణం కాస్త సులువు అనిపించేలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో గోవాకు డైరెక్ట్ ట్రైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. తాజాగా దీనిపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.