రుణమాఫీ పేరుతో రేవంత్‌రెడ్డి మరోసారి మోసం

రుణమాఫీ పేరుతో రేవంత్‌రెడ్డి మరోసారి మోసం
రుణమాఫీ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందని శాసనసభలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. 60 లక్షల మంది రైతులు అర్హులుండగా కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిందని తెలిపారు. రూ.49వేలకోట్లు రుణమాఫీకి ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.17వేలకోట్లే ఇచ్చారని విమర్శించారు.
 
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల‌కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ద‌మ్ముంటే గ్రామాల‌కు వెళ్లి పూర్తి స్థాయిలో రైతుల‌కు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలని సవాల్ చేశారు. మూడువిడతల్లో రుణమాఫీ చేసిన రైతుల వివరాలు వారం రోజుల్లోగా ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాల‌ను ప్రభుత్వం ఈ నెలాఖ‌రులోగా మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.
 
రుణమాఫీ కాని రైతులను కూడా మోసం చేసేందుకే దరఖాస్తులు చేసుకోమన్నారని పేర్కొంటూ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేకనే రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపించారు. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేక‌త‌ను త‌గ్గించేందుకు కొత్త డ్రామాకు తెర‌తీశారని ధ్వజమెత్తారు.  రైతులంద‌రికీ రుణాలు మాఫీ చేసామంటున్న సీఎం త‌మ రుణాలు మాఫీ కాలేదంటూ క్షేత్రస్థాయిలో నిర‌స‌న‌లు తెలుపుతున్న రైతుల‌కు ఏం స‌మాధానం చెప్తారన్నారు. రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ విలీనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. 

బీజేపీ ఏం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుందన్న ఆయన, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించిన ఏలేటి, అంత అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పూర్తి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రైతు భరోసా ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్తారని ఏలేటి నిలదీశారు. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత సీఎంను ఉద్దేశించి సవాల్ విసిరారు. రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా ఎందుకివ్వడంలేదని ఎప్పటిలోపు ఇస్తారని ప్రశ్నించారు.  రైతు భరోసా పథకానికి మార్గద‌ర్శకాల‌పై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీ తక్షణమే ప్రభుత్వానికి రిపోర్ట్‌ సమర్పించాలని డిమాండ్ చేయసారు.

నివేదిక‌పై చ‌ర్చించి రైతు భ‌రోసా స్కీమ్‌ గైడ్‌లైన్స్‌ను ఖరారు చేసేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశ పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతు భ‌రోసా ఖ‌రీఫ్ సీజ‌ను డ‌బ్బుల‌ను ఈ నెలాఖ‌రులోగా రైతుల‌కు ఇవ్వాలని స్పష్టం చేశారు. వరంగల్‌లో రుణమాఫీ కృతజ్ఞత సభ పెట్టండి.. రైతులే మిమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారో చూడాలని ఎద్దేవా చేశారు. 

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందంటే, అందరికీ రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నట్లే కదా? అని నిలదీశారు. మీరు చెప్పిన గ్రామానికే వెళ్లి, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో వారినే నేరుగా అడుగుదామని, ఇందుకోసం మీరు వస్తారా? మీ వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా? రండి అని సీఎంకు ఏలేటి సవాలు విసిరారు.