ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!

ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించటంతో పాటు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి కూడా ఉపసంహరించుకున్నారు. ఫలితంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. 
 
బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.  జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స సత్యనారాయణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 

విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బ‌లాన్ని ప‌రిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బొత్స ఎన్నికకు లైన్ క్లియర్ అయిపోయింది.