అర్ధరాత్రి దుండగుల విధ్వంసం.. దీదీ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు

అర్ధరాత్రి దుండగుల విధ్వంసం.. దీదీ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు
ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో నిన్న జరిగిన విధ్వంస ఘటనపై కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వంపై  తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వర్తించగలరని ప్రశ్నించింది.
 
ఈ దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం స్పష్టం చేశారు. ఏ కారణం చేతనైనా క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ఆర్డర్‌లోని సెక్షన్ 144ని పాస్ చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.
 
‘పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకావం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్‌ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..? 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అనేది అసాధ్యం. ఇంత మంది ఆసుపత్రి వద్ద గుమిగూడితే.. అది ముందుగా పోలీసులకు తెలియదనడం నమ్మశక్యంగా లేదు’ అని స్పష్టం చేసింది. 
 
`ఇది ముమ్మాటికీ రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్‌ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆందోళనకారుల వేషధారణలో దాదాపు 40 మంది ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారని, పోలీసులపై రాళ్లు రువ్వారని, దీంతో జనాన్ని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయని కోల్​కతా పోలీసులు తెలిపారు. 
 
ఈ కేసు తదుపరి విచారణ ఆగస్ట్ 21వ తేదీన జరుగుతుందని జస్టిస్ టి.ఎస్. శివజ్జానం స్పష్టం చేశారు. ఆ రోజు.. ఈ దాడి వ్యవహారంపై వేర్వేరుగా అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులు, ఆసుపత్రి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ దాడికి దారి తీసిన పరిస్థితులను డ్యాకుమెంట్ రూపంలో అందజేయాలని పోలీసులను ఈ సందర్భంగా హిరణ్మయి భట్టాచార్య కోరారు. అలాగే ఆగస్ట్ 9వ తేదీన ఆర్ జీ కార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి కేసు దర్యాప్తునకు సంబంధించిన మధ్యంతర నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా సీబీఐని సైతం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.
 
వైద్యురాలి హత్య నేపథ్యంలో ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదన్న ఆరోపణల వెల్లువెత్తుతున్న సమయంలో మమతా బెనర్జీ స్వయంగా నిరసనలకు దిగుతుండటం వార్తలకెక్కింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ ఆమె శుక్రవారం సాయంత్రం నిరసన చేపట్టనున్నారు. ఆదివారంలోపు ప్రకటన చేయాలని సీబీఐకి డెడ్​లైన్​ ఇచ్చారు.
 
మరోవైపు కుమార్తె హత్యాచార ఘటనపై ఆమె తండ్రి మరోసారి స్పందించారు. కుమార్తె మృతి కారణంగా తమకు నష్ట పరిహారం వద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో తమకు న్యాయం జరిగితే చాలని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన పోరాటానికి వారంతా కుటుంబ సభ్యులుగా బాసటగా నిలుస్తారని పేర్కొన్నారు.