మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్ లపై సిఐడి విచారణ

మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్ లపై సిఐడి విచారణ
గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన `ఆడుదాం ఆంధ్ర’, `సీఎం కప్’ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై ఏపీ సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది.  సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్‌ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ స్పందించింది. 
 
ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశిస్తూ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు రూ.150 కోట్లతో `ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు అందించించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్‌ బ్యాట్లు విరిగిపోయోయాయి. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది.
అంతేకాదు ఆడుదాం ఆంధ్ర జర్సీల కొనుగోళ్ల నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.
గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి నిర్వహించిన ఈ పోటీలలో ఎవర్ని విజేతలుగా ప్రకటించాలని అప్పటి అధికార పార్టీ నేతలే నిర్ణయించారనే విమర్శలు వచ్చాయి.