కశ్మీర్‌లో ఆర్మీ కెప్టెన్‌ మృతి .. నలుగురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఆర్మీ కెప్టెన్‌ మృతి .. నలుగురు ఉగ్రవాదులు హతం

* భద్రతా పరిస్థితులపై రాజ్‌నాథ్ కీలక సమావేశం

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు. దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది.  ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఆ క్రమంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.  దీపక్ సింగ్ 48 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సైతం మరణించినట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుంది.
కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌‌ లో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద సంబంధిత ఘటనలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనె, జాతీయ భద్రతా సలహాదారులు అజితో ధోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, భద్రతా సంస్థల అధిపతులు సౌత్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుగనున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.  మరికొన్ని గంటల్లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది.
దేశ రక్షణకై జవాన్లు  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది జవాన్లు ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.  ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు.  అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు.
 
మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. అందులోభాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు సమీక్షించేందుకు బుధవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయే భల్లాతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. అలాంటి వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
ఇలాఉండగా, దీనికి ముందు ఆగస్టు 10న అనంతనాగ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కథువా, దోడా, ఉదయంపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి సహా పలు ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. జూలై 21 వరకూ జరిగిన 11 ఉగ్రవాద సంబంధిత ఘటనలు, 24 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లలో భద్రతా సిబ్బంది, పౌరులతో సహా 28 మంది మృతి చెందినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్‌సభకు తెలిపింది.
గత నెలలో కుప్వారా జిల్లాలో ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) దాడులను భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో పాకిస్థాన్ చొరబాటుదారుతో పాటు, ఇండియన్ ఆర్మీ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మేజర్ ర్యాంక్ అధికారితో సహా నలుగురు గాయపడ్డారు.