సుంకిశాల ప్రాజెక్టు లో ప్రమాదం నాసిరకం నిర్మాణం వల్లనే జరిగిందని స్పష్టం చేస్తూ అందుకు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ బాధ్యత వహించాల్సిందే అని బిజెపి శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. నాసిరకం నిర్మాణ పనులతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెగా కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసలు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాసిరకం పనులు చేస్తున్న మెగా కంపెనీని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఇచ్చిన కాంట్రాక్టులన్నీ వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టును మున్సినల్ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ ఘటనకు ఆ శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 2న ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా అపుడే ఈ ప్రమాద ఘటనను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఆరు గంటల షిఫ్టు ముగించుకొని కార్మికులు పంపుహౌస్ బయటికి వచ్చేశారని చెబుతూ ఒక అరగంట ముందు ఈ ప్రమాదం జరిగి ఉంటే వందలాది ప్రాణ నష్టం జరిగి ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సుంకిశాల ఘటన జరిగిన వారం రోజులకు, అదీ మీడియా బయట పెట్టిన తర్వాతనే ప్రభుత్వం స్పందించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని అంటూ మరి గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తారనే కదా ప్రజలు కాంగ్రెసుకు ఓట్లేసి గెలిపించిందని ఆయన నిలదీశారు.
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును 2021 జూన్ లో మెగా ఇంజనీరింగ్ సంస్ధ టెండరులో దక్కించుకుంది. రూ.1,450 కోట్లతో ప్రారంభమైన ఈ కాంట్రాక్టు అంచనా వ్యయాన్ని ఆ తర్వాత రూ.2,215 కోట్లకు పెంచారు. సుంకిశాల ప్రాజెక్టును నిర్మిస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్ధ తనంత తానుగా గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేస్తుంటే వాటర్ బోర్డు ఇంజినీర్లు ఎందుకని పర్యవేక్షించలేదని మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు.
మెగా ఇంజనీరింగ్ సంస్ధ ఎందుకని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు?ఎందుకని ఇష్టానుసారంగా వ్యవహరించింది? నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెసు మెగా ఇంజనీరింగ్ సంస్ధకు ఎందుకని దాసోహం అంటున్నారు? కమిషన్ల కోసమేనా? అంటూ బిజెపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెసు రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకే కట్టబెడుతోందని, తెలంగాణలో కాంట్రాక్టర్లు ఎవరూ లేరా? ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును దోచిపెడుతోందని ఇప్పటి సిఎం అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పలుసార్లు ఆరోపించారని ఆయన గుర్తు చేశారు.
కమిషన్ల కోసమే కేసిఆర్ సర్కారు కాంట్రాక్టులన్నీ మెగా కంపెనీకి కట్టబెడుతోందని కాంగ్రెసు గతంలో ఆరోపించిందని, తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తామని ప్రగల్బాలు పలికిందని అంటూ మరిప్పుడు ఏమైందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మెగా ఇంజనీరింగ్ సంస్ధ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కారు ఆ కంపెనీని ఎందుకని బ్లాక్ లిస్టులో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
మొన్నఅమృత్ స్కీములో కేంద్రం ఇచ్చిన నిర్మాణ పనులను కూడా రేవంత్ సర్కారు మెగా ఇంజనీరింగ్ సంస్ధకు కట్టబెట్టిందని, ఇపుడు సిఎం రేవంత్ రెడ్డి గారి సొంత అసెంబ్లీ సెగ్మెంటు కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మెగా కంపెనీకే ఇస్తారట అని బిజెపి నేత చెప్పుకొచ్చారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనను గోప్యంగా ఉంచడానికి బాధ్యులు ఎవరో తేల్చి, వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి