
వినేశ్ ఫోగాట్ ఈసారి మెడల్ ఖాయం చేసిందని మురిసిపోయేలోపే ఫైనల్ కు ముందు ఆమె కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందని తేలడంతో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఫైనల్ బౌట్ తలపడే అవకాశం రాలేదు. ఆమెకు ఎలాంటి మెడల్ కూడా దక్కలేదు. అయితే దీనిపై వినేశ్ వెంటనే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)కు అప్పీల్ చేసింది.
ఈ విజ్ఞప్తిని అంగీకరించి తదుపరి చర్యలను వివరిస్తూ స్వర్ణ పతక పోరులో వినేశ్ అభ్యర్థనను తాము అంగీకరించలేమని సీఏఎస్ స్పష్టం చేసింది. అయితే ఆమెకు సంయుక్త రజత పతకాన్ని ప్రదానం చేసే అవకాశంపై కేసును విచారించేందుకు మాత్రం అంగీకరించింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసేలోగానే దీనిపై సీఏఎస్ తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.
“ఒలింపిక్ గేమ్స్ పారిస్ 2024లో మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతక పోరుకు ముందు తనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) తీసుకున్న నిర్ణయానికి సంబంధించి భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (దరఖాస్తుదారు) 2024 ఆగస్టు 7న దరఖాస్తు దాఖలు చేశారు” అని సీఏఎస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, ఫైనల్ బౌట్‌కు ముందు మరోసారి బరువు చూడాలని, ఫైనల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు ప్రకటించాలని సీఏఎస్ అడ్ హాక్ డివిజన్ ను వినేశ్ కోరింది. ఫైనల్ బౌట్ లో తలపడే అవకాశం సీఏఎస్ ఇవ్వకపోయినా రజత పతకం ఇవ్వాలన్న అభ్యర్థనపై మాత్రం విచారణ జరుపుతోంది. దీనిపై ఆగస్ట్ 11లోగా తుది నిర్ణయం రానుంది.
అదే రోజు పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఒకవేళ వినేశ్ కు అనుకూలంగా నిర్ణయం వస్తే మాత్రం భారత్ ఖాతాలో మరో సిల్వర్ మెడల్ వచ్చి చేరుతుంది. అనర్హత వేటు వేయడంతో వినేశ్ మరుసటి రోజే రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కనీసం ఇప్పుడు సిల్వర్ మెడల్ వస్తే అయినా ఆమె కెరీర్ కు ఘనమైన ముగింపు లభించినట్లు అవుతుంది.
కాగా, భారత మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు మద్దతుగా నిలిచాడు. అనర్హత వేటు వేయడాన్ని సచిన్ విమర్శించారు. వినేశ్ పతకానికి అర్హురాలని పేర్కొన్నాడు. క్రీడల్లో నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించాడు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు.
ప్రతి క్రీడకు కొన్ని నియమాలు ఉంటాయని, ఆ నియమాలను సందర్భోచితంగా ఉండాలని చెప్పాడు. కొన్నిసార్లు వాటిని కూడా మళ్లీ చూడాల్సి ఉంటుందని.. వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు అర్హత సాధించిందని, బరువు ఆధారంగా అనర్హత ఫైనల్‌కు ముందు జరిగిందని తెలిపాడు. అయితే, సిల్వర్ మెడల్ ఇవ్వకపోవడం సరికాదన్నాడు.
ఒక ఆటగాడు అనైతిక చర్యలకు పాల్పడితే వేటు వేయడం సమంజసమేనని, కానీ వినేశ్ విషయంలో అలా జరగలేదని మాస్టర్ బ్లాస్టర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. డ్రగ్స్ వాడడం తదితర అనైతిక చర్యలకు పాల్పడడం అథ్లెట్‌ను అనర్హురాలిగా ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చునని తెలిపాడు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిందని, ఆమె ఖచ్చితంగా రజత పతకానికి అర్హురాలని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ నిర్ణయం కోసం తామంతా ఎదురుచూస్తున్నామని, వినేశ్‌కి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నానంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
More Stories
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత