అనేక ఆంక్షలతో రైతు రుణమాఫీ హామీకి తూట్లు పొడిచిన రేవంత్ సర్కార్ కు రైతులు బుద్ధి చెబుతారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కానటువంటి రైతుల నుండి క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు రైతు రచ్చబండ కార్యక్రమానికి ఆ పార్టీ శ్రీకారంచుట్టారు.
రంగారెడ్డి రూరల్ జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతి పేటలో జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటూ రైతు రుణమాఫీ విషయంలో జీవో నెంబర్ 567 పేరుతో అనేక ఆంక్షలు విధించి 60 శాతం రైతులను రుణమాఫీకి దూరం చేసిన కాంగ్రెస్ నాయకులు అందరికీ రుణమాఫీ జరిగిందని ఊదరగొట్టే ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రైతు రచ్చబండ కార్యక్రమానికి వచ్చి రుణమాఫీ విషయంలో మోసపోయిన రైతులకు సమాధానం చెప్పాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులంతా సంఘటితంగా ఉద్యమించి గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతుల పక్షానరైతుల పక్షాన ఉద్యమించేందుకు వారికి భరోసా కల్పించేందుకు కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేతుల మీదుగా హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించామని చెప్పారు.
వేలాదిగా బాధిత రైతులు తమ వివరాలను నమోదు చేస్తున్నారని,దానిలో భాగంగానే క్షేత్రస్థాయిలో బిజెపి రైతు రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రత్యక్షంగా రైతుల వద్ద నుంచి ఫిర్యాదులు సేకరించడంతోపాటు వారికి మనోధైర్యాన్ని కల్పించేందుకు బిజెపి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి హామీలను నమ్మి ఓటేస్తే నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా ఉన్నదని ఆయన చెప్పారు.
రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణ మాఫీ హామీ రైతు భరోసా రైతులందరికీ అందే వరకు బిజెపి రైతుల పక్షాన పోరాడుతుందని బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి మాట్లాడుతూ బాధితులను సంఘటితం చేసి, వారి పక్షాన పోరాడటానికి ప్రత్యక్ష కార్యాచరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున రుణమాఫీ హామీ విషయంలో మోసపోయిన రైతులు తమ వివరాలను నమోదు చేయడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో ఎంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందో బట్టబయలు అవుతున్నదని చెప్పారు. బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి