కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్

కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్
కమలా హారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ను ఎంపిక చేసుకున్నారు. ఫిలడెల్ఫియాలో ఆగస్టు 6, మంగళవారం జరిగే తమ మొదటి సంయుక్త ర్యాలీలో హారిస్, టిమ్ వాల్జ్ కలిసి కనిపించనున్నారు. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ను నిర్ధారించే ఎంపిక ప్రక్రియ సమయంలో వాల్జ్ ఆమెకు బాగా సహకరించారని తెలుస్తోంది. 
 
టిమ్ వాల్జ్ ‘హ్యాపీ గో లక్కీ’ స్వభావానికి కమలా హారిస్ ముగ్ధుడయ్యారని సమాచారం. ఉపాధ్యక్ష పదవికి టిమ్ వాల్జ్ ను ఎంపిక చేయడంపై డెమొక్రాట్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  తన ఉపాధ్యక్ష పదవికి టిమ్ వాల్జ్ ను కమలా హారిస్ ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని సీఎన్ఎన్ కు చెందిన జాన్ కింగ్ వివరించారు.
 
ముఖ్యంగా వాల్జ్ తో తన “కంఫర్ట్ లెవల్” బావుంటుందని, పాలనలోనూ వాల్జ్ అనుభవం, ఆయన సూచనలు తనకు ఉపయోగపడ్తాయని కమల భావించి ఉంటారని చెప్పారు. రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో వాల్జ్ తనకు సహకరిస్తారని కమల భావించి ఉంటారని కింగ్ చెప్పారు.
 
అమెరికా చట్టసభలో 12ఏళ్లపాటు సేవలందించిన టిమ్‌వాల్ట్స్‌.. 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. రాజకీయ వ్యూహాలతో రిపబ్లికన్‌ పార్టీని ఎండగట్టే ఆయన.. ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచేవారు. టిమ్‌వాల్ట్స్ ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో 24ఏళ్ల పాటు సేవలందించారు. డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబడటానికి పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మిన్నెసోటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్‌ ఇరువురు పోటీపడగా టిమ్‌ను అదృష్టం వరించింది.