‘మైసూర్ చలో’ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప ప్రారంభిస్తూ ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న సీఎం సిద్ధరామయ్య వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘ఆయన సొంతంగా రాజీనామా చేయడం సిద్ధరామయ్యకు మంచిది. రాజీనామా చేస్తే ఆయనకే గౌరవం మిగులుతుంది’ అని హితవు చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీలో విపక్ష నేత ఆర్ అశోక మాట్లాడుతూ ‘ఈ అంశంలో సీఎం సిద్దరామయ్యకు నోటీసు ఇచ్చినందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. గవర్నర్ నోటీసు ఇచ్చిన తర్వాత మీ (సిద్ధరామయ్య)లో వణుకు మొదలైంది. సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు ఆయన (గవర్నర్) అనుమతి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించొచ్చు’ అని చెప్పారు.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి కాంగ్రెస్ పార్టీ కబుర్లు చెబుతుందని, కానీ ముడా, వాల్మికీ కార్పొరేషన్ కుంభకోణాలు వెలుగు చూడటంతోనే వారి ‘దళిత వ్యతిరేక’ వైఖరి స్పష్టమైందని ధ్వజమెత్తారు. కొన్ని నెలల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం పతనం అవుతుందని జోస్యం చెప్పారు.
మొత్తం 132 కిమీ దూరం జరిగే ఈ పాదయాత్రకు మొదట్లో అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం యాత్ర ముందు రోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు కూడా పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ విజయేంద్ర మైసూర్ లోని చాముండేశ్వరి అమ్మవారిని సందర్శించుకున్నారు.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుందని, కానీ హామీలను అమలు పరచకుండా ప్రజలను మోసం చేస్తున్నదని విజయేంద్ర విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుందని చెబుతూ బాధిత వర్గాలకు న్యాయం జరగాలని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షం ప్రజల గొంతుకగా పనిచేస్తుందని విజయేంద్ర పేర్కొన్నారు. “మా ‘మైసూరు చలో’ ఉద్యమం వ్యక్తులకు సంబంధించినది కాదు. ఇది ప్రజల సంపద, హక్కులను కాపాడటంలో మా నిబద్ధతను సూచిస్తుంది. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం చాలా కీలకం. ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తపరిచే ఈ ముఖ్యమైన పాదయాత్రకు మేము అందరి సహకారం, మద్దతును కోరుతున్నాము. ఈ ప్రయత్నంలో మాతో కలసిరావాలని సమాజాన్ని కోరుతున్నాను” అని విజయేంద్ర విజ్ఞప్తి చేశారు.
కాగా, తనపై వచ్చిన ఆరోపణలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ‘అవినీతికి బీజేపీ గ్రాండ్ ఫాదర్’ అని ఎద్దేవా చేశారు. ‘ఒకవేళ అవినీతికి తాత ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ. 40 శాతం అవినీతి ఎవరిదని అంటే బీజేపీది అని మాత్రమే సమాధానం వస్తుంది’ అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే పతనం అవుతుందని జోస్యం చెప్పిన కుమారస్వామి ఇంకెన్ని రోజులు కేంద్ర మంత్రిగా ఉంటారో చూద్దాం అని ఎద్దేవా చేశారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు