కమలా హారిస్‌తో డిబేట్‌కు ఓకే చెప్పిన ట్రంప్

నవంబర్ 5న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్‌ కమలా హారిస్‌ పేరు కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ట్రంప్‌ ఓకే చెప్పారు.

సెప్టెంబర్‌ 4న వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌తో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ నిర్వహించాలని ఫాక్స్‌ న్యూస్‌ చేసిన ప్రతిపాదనకు ట్రంప్‌ అంగీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. సెప్టెంబర్‌ 4 బుధవారం నాడు కమలా హారిస్‌తో డిబేట్‌ చేయడానికి ఫాక్స్‌ న్యూస్‌ చేసిన ప్రతిపాదనకు తాను అంగీకరించినట్లు ట్రంప్‌ తెలిపారు. అయితే ఈ డిబేట్‌ను, దాని షరతులకు కమలా హారిస్‌ అంగీకరించారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

గతంలో ఏబీసీలో బైడెన్‌తో చర్చ జరిగిందని గుర్తు చేశారు. అయితే, ఆ డిబేట్‌ అనంతరం బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, జూన్‌ 27న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌ మధ్య జరిగిన చర్చలో ఇరువురు నేతలూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు.

‘‘సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే ఈవెంట్‌లో కమలా హారిస్‌తో డిబేట్‌ చేసేందుకు అంగీకరించాను. వాస్తవానికి ఇదే తేదీన ఏబీసీ ఛానల్‌లో జో బైడెన్‌తో నేను ముఖాముఖి చర్చలో పాల్గొనాల్సింది. అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలగడంతో ఆ డిబేట్‌ రద్దయ్యింది. ఫాక్స్‌న్యూస్‌ డిబేట్‌ పెన్సిల్వేనియాలో జరుగుతుంది. బైడెన్‌తో జరిగిన చర్చలోని రూల్స్‌ అన్నీ దీనికి వర్తిస్తాయి. కానీ ఈసారి పూర్తిస్థాయిలో ప్రేక్షకులు కూడా ఉంటారు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇక ఈ డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది. దీంతో బైడెన్‌కు సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. అదే సమయంలో డెమోక్రాట్ల అభ్యర్థిగా ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హారిస్‌ బరిలోకి వచ్చారు. 

ఈ క్రమంలో ట్రంప్‌తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని కూడా ప్రకటించారు. కానీ ట్రంప్‌ మాత్రం అందుకు అంగీకరించలేదు. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించే వరకూ వేచి చూస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న కమలా హారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రాటిక్‌ పార్టీ ఖరారు చేసింది. దీంతో హారిస్‌తో డిబేట్‌కు ట్రంప్‌ సై అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన ఓట్లు ఆమెకు లభించినట్టు డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 4 వేల మంది డెలిగేట్లు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టు వెల్లడించింది.