అత్యధిక జనాభా, గృహ సాంద్రత ప్రధాన కారణం

అత్యధిక జనాభా, గృహ సాంద్రత ప్రధాన కారణం

అత్యధిక జనాభా, గృహ సాంద్రత కారణంగా పశ్చిమ కనుమలలో ముఖ్యంగా కేరళ వంటి ప్రాంతాల్లోని నివాసులు అధికంగా కొండచరియలు విరిగిపడే విపత్తును ఎదుర్కొంటారని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఓ నివేదికలో పేర్కొంది. హిమాలయాల్లో కంటే తక్కువ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు ఉన్నప్పటికీ పశ్చిమ కనుమలలో నివసించే ప్రజలకు  ముప్పు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. 

అలాగే పశ్చిమ కనుమల్లోని కొండచరియలు నిటారుగా ఉండటంతో పాటు, ప్రధానంగా వాలులోని మట్టిదిబ్బల ద్వారా నియంత్రించబడతాయని నివేదిక పేర్కొంది. కీలకమైన సామాజిక- ఆర్థిక పరిమితుల ఆధారంగా ఇస్రో గతేడాది కొండచరియలు విరిగిపడే ప్రదేశాలకు సంబంధించిన జాతీయ స్థాయి డేటాబేస్‌ను రూపొందించింది. 

ఈ జాబితాలో కేరళలోని వయనాడ్‌ ఐదవ స్థానంలో నిలిచింది. వయనాడ్‌లో మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో సుమారు 300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇటువంటివి కేరళలో పలు ప్రాంతాలు ఉన్నట్లు ఇస్రో తన నివేదికలో పేర్కొంది. 17 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 147 జిల్లాల్లో వయనాడ్‌ 13 స్థానంలో ఉండగా, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌; మలప్పురం, కోజికోడ్‌లు వరుసగా మూడు, ఐదు, ఏడు, పదవ స్థానాల్లో ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. 

కేరళలోని ఇతర జిల్లాలైన కన్నూర్‌ (26), తిరువనంతపురం (28), పథనంతిట్ట (33), కాసరగోడ్‌ (44), కొల్లం (48), అలప్పుజ (138) స్థానాల్లో వున్నాయి. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న పశ్చిమ కనుమలు, హిమాలయ ప్రాంతాలను పరిశీలించి ఇస్రో కేంద్రాలలో ఒకటైన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ”ల్యాండ్‌స్లైడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా” ను విడుదల చేసింది. దీనిలో ఉత్తరాంచల్‌లోని రుద్రప్రయాగ మొదటిస్థానంలో నిలిచింది.

ఇస్రో రూపొందించిన ‘ల్యాండ్‌స్లైడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా’ 20 ఏళ్లుగా వయనాడ్‌ జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా వయనాడ్‌లోని కొండచరియలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు, తర్వాత చిత్రాలను ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోశాట్‌-3, ఆర్‌ఐఎస్‌ఏటీ ఉపగ్రహాలు రికార్డు చేశాయి. 
 
ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అంతరిక్షం నుంచి తీసిన ఈ 3డీ చిత్రాలను విశ్లేషించింది.  తాజాగా రికార్డ్‌ అయిన చిత్రాల ప్రకారం సముద్రమట్టానికి 1,550 మీటర్ల ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడగా, ఈ ప్రభావంతో 86 వేల చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. 
 
ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపుళ నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా, ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి. విలయం తర్వాత రికార్డయిన 3డీ చిత్రంలో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో విశ్లేషించింది.