
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. షూటింగ్ సంచలనం మను భాకర్ ‘డబుల్ మెడల్’ ఇచ్చిన స్ఫూర్తితో ఆయా క్రీడాంశాల్లో విజయాలతో సత్తా చాటుతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు.
ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడాడు. తాజా మెడల్‌తో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఆట మొదట్లో స్వప్నిల్ కాస్త నెమ్మదించినప్పటికీ, తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో టాప్ -2లోకి దూసుకెళ్లాడు. ఇక చివర్లో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవడం వల్ల స్వప్నిల్ మూడో స్థానంలో దక్కించుకున్నాడు.
స్వప్నిల్ కంటే ముందు 463.6 పాయింట్లతో లీ యుకున్ (చైనా) స్వర్ణ పతకం దక్కించుకోగా, 461.3 పాయింట్లతో కులిశ్ (ఉక్రెయిన్) రజతం సొంతం చేసుకున్నాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 పాయింట్లు సాధించిన స్వల్నిల్ ఏడవ స్థానంలో నిలిచారు. ఎక్కువ సంఖ్యలో పది పాయింట్లు కొట్టిన నేపథ్యంలో స్వప్నిల్‌కు ఫైనల్ అర్హత సాధించాడు. ఇక గురువారం ఫైనల్‌లోనూ సత్తాచాటాడు. ప్రపంచ నంబర్ 1 షూటర్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుసలేను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. “స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శన! #ParisOlympics2024లో పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు అతనికి అభినందనలు. అతని ప్రదర్శన ప్రత్యేకం ఎందుకంటే అతను అద్భుతమైన దృఢత్వం, నైపుణ్యాలను కనబరిచాడు. పతకం గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్ కూడా. ఈ కేటగిరీలో ప్రతి భారతీయుడు సంతోషంతో నిండి ఉన్నాడు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో స్వప్నిల్ కుసాలే భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించిన 7వ షూటర్‌గా నిలిచాడు. కాగా, 50మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత్ పతకం నెగ్గడం ఇదే తొలిసారి. ఇక, ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ సాధించిన మూడు పతకాలు కూడా షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ క్రీడలో భారత్ మూడు పతకాలు సాధించింది. పారిస్ ఒలింపిక్స్ లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొనగా, అందులో అత్యధికంగా 21 మంది షూటర్లు ఉన్నారు.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి తను స్ఫూర్తి పొందినట్లు స్వప్నిల్ చెప్పాడు. ధోనీ లాగే స్వప్నిల్ కూడా రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగి. 2015 నుంచి సెంట్రల్ రైల్వేస్‌లో కుసాలే పని చేశాడు. ప్రశాంతత, సహనం క్రికెట్, షూటింగ్‌కు చాలా అవసరమని, ఆ లక్షణాలు ధోనీని చూసి నేర్చుకున్నానని కుసాలే పేర్కొన్నాడు. ‘నేను షూటింగ్ ప్రపంచంలో ఎవరినీ ప్రత్యేకంగా అనుసరించను. నేను ధోనీని ఆరాధిస్తాను. అతను మైదానంలో ఉన్నంత ప్రశాంతంగా, ఓపికగా ఉండటం నా క్రీడకు అవసరం. నేను కూడా అతడి లాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి, తన స్టోరీకి రిలేట్ అవుతాను’ అని తెలిపాడు.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు