కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సున్నితమైన జాతీయ భద్రత అంశం, అగ్నిపథ్ పథకంపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఆరోపించారు.ఈ విషయమై పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేయడానికి తాను సిద్ధమని రాజ్‌నాథ్ చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ వ్యాఖ్యల అనంతరం లోక్‌సభలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ గురించి పలు దురభిప్రాయాల వ్యాప్తికి ప్రతిపక్ష నేత ప్రయత్నించారని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చకు సమాధానం ఇచ్చినప్పుడు వివరణ ఇస్తారని చెప్పారు. సున్నితమైన జాతీయ భద్రత అంశం, అగ్నిపథ్ పథకం గురించి రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టించజూస్తున్నారని రాజ్‌నాథ్ ఆక్షేపించారు.
‘మన జవాన్లు దేశ సరిహద్దులను రక్షిస్తుంటారు. అది మన జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం. అగ్నివీర్ అంశంపై కూడా దేశాన్ని తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయి. మీరు నాకు ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు ఒక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
ఆయన మాట్లాడుతుండగా మధ్యలో రాహుల్ గాంధీ అమరవీరుల నష్టపరిహారం అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో మందుపాతర పేలి గత జనవరిలో మరణించిన అగ్నివీర్‌కు ఇన్‌సూరెన్స్ ఇచ్చారనే కానీ, ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.
దీనికి ముందు, సభలో రాహుల్ మాట్లాడుతూ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజానీకానికి ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ఆధునిక చక్రవ్యూహాన్ని నిర్మించిందని, అందులో రైతులు, మధ్యతరగతి ప్రజలు, సమాజంలోని ఇతర వర్గాల వారు చిక్కుకున్నారని పేర్కొన్నారు. పద్మవ్యూహం కమలాకారంలో ఉంటుందని చెప్పారు.
కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉందని, రైతులు భయపడుతున్నారని, చెప్పారు. కమలం పద్మవ్యూహాన్ని మోదీ, అమిత్‌షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ వంటి వారు కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేసుకోవడంతో రాహుల్ తిరిగి స్పందిస్తూ…” మీరు కోరితే ఎన్ఎస్ఏ, అంబానీ, అదానీ పేర్లు మినహాయించి, తక్కిన మూడు పేర్లు తీసుకుంటాను” అని చెప్పారు.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు