* సీఎం విజయన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలను వర్షం ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
మంగళవారం కురిసిన వర్షానికి వయనాడ్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 60మందికిపైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ 20 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటానస్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అదనపు బృందాలు కూడా వయనాడ్‌కు చేరుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండచరియలు విరిగిపడడంతో అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల స్కూల్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇలాంటి విపత్తను ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు తెలిపారు.
ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.
సహాయక చర్యలు వేగవంతం చేయడం కోసం 225 మంది ఆర్మీ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు, రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా ఆర్మీ సహాయం కోరింది కేరళ ప్రభుత్వం. దీనిపై స్పందించిన ఆర్మీ, 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టిఎ) మద్రాస్ నుండి సెకండ్-ఇన్-కమాండ్ నేతృత్వంలోని 43 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. అంతేకాకుండా ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, 40 మంది సైనికులతో కూడిన బృందం సహాయక చర్యల కోసం సిద్ధమైంది.
కాగా, రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసర్‌గోడ్, కన్నూర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
కర్ణాటకలో పట్టపగలే బ్యాంక్ లో రూ 12 కోట్లు దోపిడీ