ప్రతిపక్షం లోక్​సభ డిప్యూటీ స్పీకర్ పదవి​కై పట్టు

ప్రతిపక్షం లోక్​సభ డిప్యూటీ స్పీకర్ పదవి​కై పట్టు
లోక్‌సభలో ఉప సభాపతి పదవి ప్రతిపక్షానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్‌ పార్టీ, నీట్‌ యూజీ పేపర్‌ సహా ప్రశ్నాపత్రాల లీక్‌ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరింది. కావడి యాత్ర సాగే మార్గంలో దుకాణాల బోర్డులపై యాజమానుల పేర్లు రాయాలన్న ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్‌  వివాదస్పద నిర్ణయాన్ని ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు.

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభలో బీజేపీ ఉపనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన పార్లమెంటు అనెక్స్‌ భవనంలో ఈ భేటీ జరిగింది. 44పార్టీలకు చెందిన 55మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నేతలు గౌరవ్‌ గొగొయ్‌, జైరాం రమేశ్‌, కె.సురేశ్‌, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్‌ ఓవైసీ, ఆర్జేడీ ఎంపీ అభయ్‌ కుశ్వా, జేడీయూ నాయకుడు సంజయ్‌ ఝా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఎస్పీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌, ఎల్జేపీకి చెందిన చిరాగ్‌ పాసవాన్‌, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు అఖిల పక్ష భేటీకి హాజరయ్యారు.

గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్‌నాథ్‌సింగ్‌, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని విపక్ష నేతలను కోరారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు.

అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలు, సలహాలను తగిన వేదికలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
“అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నాం. కలిసికట్టుగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను నడిపిద్దామని చెప్పాం. పార్లమెంటు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలపైనా ఉంది. ప్రతిపక్ష పార్టీల నేతలు చాలా సూచనలు చేశారు” అని రిజిజు చెప్పారు. 
 
వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌తో చర్చించి వాటిపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై పార్లమెంటరీ వ్యవహారాల సలహా సంఘం భేటీలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.  బిహార్‌కు ప్రత్యేక హోదా కేటాయించాలని ఎల్జేపీ, జేడీయూ డిమాండ్‌ చేశాయి. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎన్డీయే భాగస్వామ్యపక్షం టీడీపీ డిమాండ్‌ చేయకపోవడాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ తప్పుపట్టారు. ఎన్నికల అనంతరం ఏపీలో చెలరేగుతున్న హింస, విపక్షంపై జరుగుతున్న దాడులపై ఈ సమావేశంలో వైసీపీ ప్రస్తావించింది.