ఐటి ఉద్యోగుల పనిగంటలు పెంచే యోచనలో కర్ణాటక

ఐటి ఉద్యోగుల పనిగంటలు పెంచే యోచనలో కర్ణాటక

కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకే 100శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లుతో చేతులు కాల్చుకున్న అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక స్టేట్‌ ఐటీ ఆధారిత సేవలు అందించే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ను కలిసి తమ అభ్యంతరం తెలిపారు. 

సాఫ్ట్‌వేర్ నిపుణులు, ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ పని గంటలు, అధిక ఒత్తిడితో తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు. ఆ విషయానికి సంబంధించిన పలు నివేదికల వివరాలను కర్ణాటక మంత్రికి సమర్పించారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. 

రోజులో గరిష్ఠంగా 14గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఎక్కువ గంటలతో కలిపి గరిష్ఠంగా 10గంటలు మాత్రమే పనిచేయించేందుకు అనుమతి ఉంది. అయితే, వరుసగా మూడు నెలల్లో ఉద్యోగితో 125 గంటలకు మించి అదనపు గంటలు పని చేయించుకోకూడదన్నది అందులోని మరో కీలకాంశం. 

ఐటీ ఉద్యోగుల పనిగంటల పెంపు ప్రతిపాదనలు వచ్చాయని, ఆ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కర్ణాటక కార్మిక శాఖ మంత్రి మీడియాకు తెలిపారు. పనిగంటల పెంపుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్నారు. ఉద్యోగి రోజులో గరిష్ఠంగా ఎన్నిగంటలు పని చేయాలనే దానిపై కటాఫ్‌ ఏదీ లేదని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. 

125 గంటల గరిష్ఠ పరిమితి వల్ల కంపెనీలు ఉద్యోగులతో తమకు కావాల్సిన రోజులు లేదా వారాల్లో నిర్దిష్ట పరిమితి మేరకు పనిచేయించుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం వారంలో 48గంటలకు మించి పనిచేయించకూడదని కార్మిక చట్టాలు చెబుతున్నాయని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తుచేశారు.  పని గంటల పెంపు వల్ల ఉద్యోగులు మరింత మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.