రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం.. త్వరలో కోలుకునే అవకాశం

రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం.. త్వరలో కోలుకునే అవకాశం
రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం తగ్గింది. ఎన్డీయే బలం కూడా మెజారిటీ మార్కు కంటే 12 దిగువన ఉంది. నలుగురు నామినేటెడ్ సభ్యులైన రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే బలం కూడా 101కు పడిపోయింది.
 
ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న నేపథ్యంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గడం గమనార్హం.

కాగా, రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజారిటీ మార్కు 113. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే బలం (101) మెజార్టీ మార్కు కంటే 12 తక్కువగా ఉంది. అయితే ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమి బలం 87గా ఉంది. కాంగ్రెస్‌కు 26, బెంగాల్‌లోని అధికార తృణమూల్‌కు 13, ఆప్‌కు 10 మంది, డీఎంకేకు 10 మంది సభ్యులున్నారు.

మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీయేతర పార్టీలపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఒడిశాకు చెందిన బీజేడీకి 9 మంది సభ్యులున్నారు. అయితే బీజేడీ ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకిస్తోంది. అలాగే నలుగురు సభ్యులున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కూడా మద్దతు నిరాకరించే పరిస్థితిలో ఉంది.

కాగా, 11 మంది సభ్యులున్న ఏపీలోని వైఎస్‌ఆర్సీపీ, నలుగురు సభ్యులున్న తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. అయితే బిల్లుల అంశంలో ఈ రెండు పార్టీలు, ఇద్దరు స్వతంత్ర ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. అలాగే బీజేపీ నామినేట్‌ చేసిన ఏడుగురు సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో వీరి సహాయంతో బడ్జెట్ సమావేశాల్లో బిల్లులను ప్రభుత్వం ఆమోదింప చేసుకొనే వీలుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, జనసేనలతో కలసి బిజెపి పోటీ చేసినప్పటికీ రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం వైసిపిని ఆశ్రయించవలసి రావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటె ఆ రెండు పార్టీలకు రాజ్యసభలో ఒక సభ్యులు కూడా లేరు.

రాజ్యసభలో 19 ఖాళీల్లో నాలుగు జమ్ముకశ్మీర్‌ నుంచి, నాలుగు నామినేటెడ్‌ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి మూడు స్థానాలు దక్కుతాయి. నలుగురు నామినేటెడ్ సభ్యులు సహితం బిజెపికి మద్దతు ఇస్తారు.

అయితే త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలో బిజెపి బలం తిరిగి పెరిగే అవకాశం ఉంది. నలుగురు సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఉంది. బీహార్, మహారాష్ట్ర, అస్సాంల నుండి ఇద్దరేసి చొప్పున బీజేపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. అదేవిధంగా, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురల నుండి ఒకొక్కరు ఎన్నిక కాగలరు.

అయితే, తెలంగాణ నుండి కాంగ్రెస్ ఒక సభ్యుడిని గెలిపించుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ నుండి లోక్ సభకు ఎన్నిక కావడంతో రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ స్థానంలో బిజెపి అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. అదేవిధంగా హర్యానాలో కాంగ్రెస్ ఏకైక ఎంపీ దీపేందర్ సింగ్ హుడా రాజ్యసభకు ఎన్నిక కావడంతో జరిగే ఉపఎన్నికలో సహితం బిజెపి అభ్యర్థి గెలుపొందుతారు. ఈ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.