సమగ్ర విద్యా వికాసం కోసం విద్యా భారతి

సమగ్ర విద్యా వికాసం కోసం విద్యా భారతి

విద్యా భారతి దేశవ్యాప్తంగా సమగ్రమైన విద్యా వికాసం కోసం కృషి చేస్తోందని అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు.  స్పష్టమైన యోజన, చర్చలతోనే మెరుగైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. అందుకే విద్యా భారతి ప్రతి సంవత్సరంలోనూ స్పష్టమైన యోజన చేపట్టేందుకు వర్షారంభ సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు. 

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత స్థాయి వర్షా రంభ సమావేశాలు రెండు రోజులపాటు (శని, ఆదివారములలో ) అనంతపురం నగరంలో జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మొత్తంగా 28 అంశాల మీద విద్యా భారతి పనిచేస్తుందని వివరణాత్మకంగా తెలియజేశారు. 

కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, నాగరిక కర్తవ్య బోధ,  స్వ. భావన అనే ఐదు రకముల పంచకర్తవ్యముల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంతటా  విద్యా భారతికి అనుబంధంగా అనేక సమితిలు పనిచేస్తున్నాయి. అన్ని సమితుల నుంచి ప్రధాన ఆచార్యులు, పాఠశాల కమిటీల ప్రబంధకులు,  సమితి స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మొత్తం 350కు పైగా ప్రతినిధులు రెండు రోజులపాటు వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా విద్యా సామాజిక చైతన్యం అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఉద్ఘాటన సమయంలో అతిథిగా విచ్చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ పుస్తక పఠనంతో గొప్ప ఫలితాలు ఉంటాయి అని వివరించారు. విద్యార్థి దశ నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. 

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షతన రెండు రోజుల సమావేశాలు జరిగాయి. కార్యక్రమ సరళిని పర్యవేక్షిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేశారు. పాఠ్య ప్రణాళిక, విస్తరణతో పాటుగా వివిధ ఆయామ్ లకు సంబంధించిన ప్రగతిని సమీక్షించారు. 

రెండు రోజుల కార్యక్రమంలో రాయలసీమ సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, విద్యా భారతి ప్రాంత కార్యదర్శి ప్రతాప్ సింహ శాస్త్రి, సంఘటన మంత్రి కన్నా భాస్కర్, శైక్షణిక్ ప్రముఖ్ లు పాల్గొన్నారు.‌ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యావాహ్  వేణుగోపాల్ నాయుడు ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. 

సమారోప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ విద్యా సంబంధిత విషయాల మీద సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్. ఎ. కురి, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అనంత రాముడు తదితరులు పాల్గొన్నారు.