కర్ణాటకలో పది వేల డెంగ్యూ కేసులు.. ఏడుగురు మృతి

కర్ణాటకలో పది వేల డెంగ్యూ కేసులు.. ఏడుగురు మృతి
కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. జులై 13 వరకు 66,298 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు.  మొత్తం 9,082 మందికి పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 2,557 మందిని పరీక్షించగా, 424 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా నమోదైంది.
జ్వరం వల్ల 353 మంది ఆసుపత్రిలో చేరారని, వారిలో 119 మంది గత 24 గంటల్లో ఆసుపత్రి పాలయ్యారని వైద్యాధికారులు తెలిపారు.  కాగా, జనవరి నుంచి జులై 13 వరకు రాజధాని బెంగళూరు ప్రాంతాల్లో 2,830 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 110 మంది ఆసుపత్రి పాలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 202 డెంగ్యూ కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు చిక్కమగళూరులో జులై 13 వరకు 599 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన కేసుల్లో రెండో స్థానంలో ఈ నగరం ఉంది. 5,725 మంది పెద్దలకు డెంగ్యూ పరీక్ష నిర్వహించగా 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే సంవత్సరం నుంచి 18 ఏళ్ల లోపు వయస్సున్న 3,203 మంది పిల్లలు, ఏడాది లోపు వయస్సున్న 154 మంది శిశువులకు కూడా డెంగ్యూ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.