
మణిపూర్ లో మళ్లీ సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. జిరిబామ్ జిల్లాలో ఆదివారం జాయింట్ పెట్రోలింగ్‌పై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మరణించగా.. ఇద్దరు మణిపూర్ పోలీస్ అధికారులతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
మోర్‌బంగ్ గ్రామంలో దాడి జరిగిందని, అక్కడ ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై కొండ ప్రాంతం నుంచి కాల్పులు జరిపారని, సీఆర్పీఎఫ్ సైనికులు పెట్రోలింగ్ సమయంలో యూఎస్‌వీలో ఉండగా.. వాహనంపై బుల్లెట్ల వర్షం కురిపించారని వివరించారు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బుగ్, సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఆ తర్వాత భద్రతా సిబ్బంది కోలుకొని తిరిగి కాల్పులు జరుపడంతో ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నది.
ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. గాయపడిన సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా బలగాలపై దాడి గత ఐదువారాల్లో ఇది రెండోది. జూన్ 10న కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి పాల్పడ్డారు.
బీహార్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు. మరో జవాను గాలికి గాయం కాగా, ఇద్దరు మణిపూర్ కమండోలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం జిరిబామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయుధ దుండగులకు, బలగాలకు మధ్య జరిగిన కాల్పులు మధ్యాహ్నం 11.30 గంటలకు ముగిసాయి.
సాయుధ దండగులు భద్రతా బలగాలపై కాల్పులు జరిగిన ఘటనను ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఖండించారు. మృతిచెందిన జవాను కుటుంబానికి సంతాపం తేలియజేసారు. అమరజవాన్ల త్యాగాలు వృథాకావని స్పష్టం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, బలగాలపై కాల్పులకు తెగబడిన సాయుధ దుండగులను కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు.
More Stories
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా