అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ ఆయన కుడి చెవికి తాకింది. ప్రమాదం నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు. గాయపడిన ట్రంప్‌ను సిబ్బంది దవాఖానకు తరలించారు.
కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. ఆయన్ని రక్షించిన సీక్రెట్ సర్వీస్.. ఈ ఘటనను ట్రంప్‌పై హత్యాయత్నంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టింది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది.
అమెరికాలో ఇలాంటి దుర్ఘటన జరగడం నమ్మశక్యంగా లేదని డొనాల్డ్ ట్రంప్ విస్మయం వ్యక్తం చేశారు. దుండగుల కాల్పుల్లో తన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లిందని చెప్పారు. కాల్పుల శబ్దం వినగానే ఏదో తేడాగా ఉందని అర్ధమైందని, బుల్లెట్ తన చెవిని తాకుతూ దూసుకెళ్లిందని, దీంతో తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి ట్రూత్ సోషల్ సైట్‌లో వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని చెప్పారు. ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివారాలు తెలుసుకున్న ఆయన ఇది సరైనది కాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు దీనిని ఖండించాలని చెప్పారు. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని వెల్లడించారు.
ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందని పేర్కొన్నారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. ఇలాంటి ఘటనలను ఖండించడంలో యావత్ దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని బైడెన్ పిలుపిచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ బాగానే ఉన్నారని యుఎస్ సీక్రెట్ సర్వీస్ తెలిపింది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దుండగుడిని కాల్చి చంపారని స్పష్టం చేసింది. 1981లో రొనాల్డ్ రీగన్‌ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
కాల్పులు జరిపిన వ్యక్తి ర్యాలీలో పాల్గొనలేదని, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని కాల్చి చంపారని సమాచారం. అధ్యక్షుడు, ప్రధాన పార్టీ అభ్యర్థులతో ఈ సీక్రెట్ సర్వీస్ ప్రతిచోటా పర్యటిస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటుంది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనపై స్టేజిపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి.
సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో ఆయన స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే మాజీ అధ్యక్షుడి చుట్టూ రక్షణగా చేరారు. వేదిక పైనుంచి దించి దవాఖానకు తరలించారు. అనంతరం స్టేజీ పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి ట్రంప్ డిచ్చార్జి అయ్యారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. కాల్పుల ఘటనలో ట్రంప్ తీవ్రంగా గాయపడనందుకు మనమంతా ఉపశమనం పొందాలని పేర్కొంటూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని చెప్పారు.
ట్రంప్‌పై కాల్పులను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖండించారు. ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరుగలేదని తెలిసి ఊరట చెందానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని భవంతుణ్ని ప్రార్థిస్తున్నాని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాని వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన బాధులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన సీక్రెట్ సర్వీస్, స్థానిక అధికారులను అభినందించారు. ఇలాంటి హింసకు అమెరికాలో చోటులేదని స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. “నా స్నేహితుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా. రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా”నని సోషల్ మీడియా ఎక్స్‌లో చెప్పారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి