ముస్లిం మహిళలు భరణానికి అర్హులు

ముస్లిం మహిళలు భరణానికి అర్హులు
విడాకులు తీసుకునే ముస్లిం మహిళలకు భరణంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళకు తన భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని నుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుండి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు ఒక తీర్పులో ధృవీకరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుండి ఆర్థిక సహాయాన్ని క్లెయిమ్ చేసే హక్కును కలిగి ఉంటారని కోర్టు తీర్పు చెప్పింది.
 
భార్య నుంచి విడిపోయిన తరవాత భరణం ఇవ్వాలన్న కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను మహ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం.. దిగువ కోర్టు తీర్పును సమర్దించింది. మతాలతో సంబంధం లేకుండా విడాకులు తీసుకున్న ప్రతి మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు, భరణం అనేది ఏమీ విరాళం కాదని, అది పెళ్లైన ప్రతి మహిళ హక్కు అని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.
 
‘‘ఇంటిపట్టున ఉండే భార్య తమపైనే ఆధారపడి ఉంటుందన్న కనీస ఇంగితం కూడా కొంతమంది భర్తలకు ఉండడం లేదు. భావోద్వేగపరంగా కూడా అలాంటి మహిళలు భర్తపైనే ఆధారపడి ఉంటారు.. ఇప్పటికైనా గృహిణుల విలువ.. వాళ్లెంత త్యాగాన్ని చేస్తున్నారో పురుషులు అర్థం చేసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం చీవాట్లు పెట్టింది. తగిన ఆదాయ మార్గాలు కలిగి ఉన్న వ్యక్తి.. తన భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు భరణాన్ని తిరస్కరించలేరని సెక్షన్ 125 చెబుతుంది.
 
ఇది పౌరులందరికీ చట్టం ప్రకారం సమానత్వం, రక్షణ సూత్రాన్ని బలపరుస్తుంది. మతంతో సంబంధం లేకుండా సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని పేర్కొంది.
 
దరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్.. తన భార్యతో విడాకులు తీసుకున్నారు. వారికి విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం.. ఆమెకు భరణం చెల్లించాలని ఆదేశించింది. దీనిని తెలంగాణ హైకోర్టులో సమద్ సవాల్ చేయగా.. ఈ తీర్పులో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు. పిటీషన్ ను విచారించిన జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం, 1986లోని నిబంధనలు సిఆర్ పిసి ఏర్పాటు చేసిన లౌకిక చట్టాన్ని అతిక్రమించవని ఈ నిర్ణయం స్పష్టం చేసింది. తన మాజీ భార్యకు రూ. 10,000 భరణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ముస్లిం మహిళ హక్కును సమర్థిస్తూ ధర్మాసనం తీర్పులు వెలువరించింది.

సెక్షన్ 125 సీఆర్‌పీసీ కింద ఏదైనా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే, ఆమె ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019ని ఆశ్రయించవచ్చని కూడా కోర్టు తీర్పు చెప్పింది. ‘సెక్షన్ 125 సీఆర్‌పీసీ వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందనే ప్రధాన ముగింపుతో మేం క్రిమినల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతున్నాం’ అని న్యాయమూర్తి నాగరత్న అన్నారు.