టీమిండియా హెడ్‌కోచ్‌గా గంభీర్

టీమిండియా హెడ్‌కోచ్‌గా గంభీర్
భార‌త పురుషుల‌ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్‌ నియ‌మితుల‌య్యాడు. దాంతో, గ‌త కొన్ని రోజులుగా కొన‌సాగుతున్న సందిగ్ధానికి తెర‌ప‌డింది. మంగ‌ళ‌వారం బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా అధికార‌క ప్ర‌క‌ట‌న వెల్ల‌డించాడు. ప్ర‌ధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ స్థానాన్ని గంభీర్‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్టు షా తెలిపాడు. రెండేండ్లు గంభీర్ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నాడు. 
 
త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే శ్రీ‌లంక సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌కు తొలి ప‌రీక్ష ఎదుర‌వ్వ‌నుంది. ఒకప్పుడు ఆటగాడిగా అద్భుత బ్యాటింగ్‍తో భారత్‍కు చాలా చిరస్మరణీయ విజయాలు అందించిన అతడు.. ఇక ప్రధాన కోచ్‍గా ప్రస్థానం మొదలుపెడుతున్నాడు. అధునిక క్రికెట్ వృద్ధిని గంభీర్ దగ్గరి నుంచి చూశాడని, ఈ తరుణంలో భారత హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంబీరే సరైనోడని జై షా ట్వీట్ చేశారు. భారత జట్టును అతడు సమర్థవంతంగా ముందుకు నడుపుతాడనే నమ్మకం తమకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. 
 
“భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్‌కు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. అధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది, మార్పులన్నింటినీ గంభీర్ చాలా దగ్గరి నుంచి వీక్షించాడు. తన కెరీర్లో వివిధ బాధ్యతల్లో రాణించి, సవాళ్లను అధిగమించాడు. భారత క్రికెట్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు గంభీర్ సరైన వ్యక్తి అని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది” అని జైశా ట్వీట్ చేశారు.

ఈ ఏడాది ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా చేశాడు. అతడి మార్గదర్శకత్వం, దూకుడైన నిర్ణయాలతో కోల్‍కతా టైటిల్ గెలిచింది. ఒకప్పుడు కెప్టెన్‍గా గంభీర్ ఉన్నప్పుడు రెండు టైటిళ్లు గెలిచిన కేకేఆర్  మళ్లీ ఇప్పుడు అతడు మెంటార్‌గా వచ్చాక విజేతగా నిలిచింది. ఐపీఎల్‍లో మెంటార్‌గా గంభీర్ సక్సెస్ అవడంతో టీమిండియాకు అతడిని హెడ్ కోచ్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ కూడా అదే దిశగా చర్యలు చేపట్టింది. రాహుల్ ద్రవిడ్ తప్పుకోవటంతో ఆ స్థానంలో గంభీర్‌నే నియమించింది.

భారత జట్టు తరఫున గౌతమ్ గంభీర్ 58 టెస్టులు ఆడాడు. 4,154 పరుగులు చేశాడు. 9 శతకాలు, 22 అర్ధ శతకాలు బాదాడు. 147 వన్డేలు ఆడిన గంభీర్ 5,238 రన్స్ సాధించాడు. 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీ చేశాడు. భారత్ తరఫున 37 టీ20ల్లో 934 రన్స్ చేయగా.. అందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.