తండ్రికి వేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిల

తండ్రికి వేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

వీరితో వైఎస్ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ప్రార్థనల అనంతరం తండ్రి సమాధి వద్ద జగన్​మోహన్ రెడ్డి​ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, జగన్​ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆయన సముదాయించారు.  ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన తర్వాత ఇడుపులపాయలో తల్లి కుమారుడు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా విజయమ్మ కౌగిలించుకొని కంటతడి పెట్టుకున్నారు. అనంతరం జగన్​ మూడు రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయల్దేరారు.

మరోవైపు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోనే ఉన్న జగన్​తో కలిసి ప్రార్థనలో పాల్గొనలేదు. ఆయన వెళ్లిన అరగంట తర్వాత భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెతో వైఎస్ ఘాట్​కు చేరుకున్నారు. అనంతరం తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించారు. అయితే జగన్, షర్మిల నిర్వహించిన ప్రార్థనలు రెండింటిలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.

మరోవైపు వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి జయంతి వేడుకలను విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో షర్మిల నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విజయవాడకు రానున్నారు.

కాగా, మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెలిపారు. వైఎస్సార్‌ 75వ జయంతి సందర్భంగా ఆదివారం సోనియా ఒక లేఖ విడుదల చేశారు. ‘వైఎస్సాఆర్‌ గొప్ప నాయకుడని, అద్భుతమైన ప్రతిభ, చైతన్యం, అంకిత భావంతో దేశానికి, ఆంధప్రదేశ్‌ ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి నిస్వార్థంగా సేవ చేశారని, ఆయన నిజమైన దేశభక్తుడని లేఖలో సోనియా కొనియాడారు.