సోమవారం నుండి ఉచితంగా ఇసుక సరఫరా!

సోమవారం నుండి ఉచితంగా ఇసుక సరఫరా!
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి ఏపీ ప్రభుత్వం రంగం చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించిన ప్రభుత్వం సోమవారం ఉదయం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర్వుల ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం వెళ్లింది. సీఎం ఆమోదించిన వెంటనే ఉచిత ఇసుక అమలు ఉత్తర్వు(జీవో) వెలువడనుందని గనుల శాఖ తెలిపింది. 

ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇసుకను మనుషులతో తవ్వి తీయించి, లారీల్లో లోడ్‌ చేయించి, తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చవుతుంది. దీన్నే నిర్వహణ (ఆపరేషనల్‌) వ్యయంగా పిలుస్తారు. రీచ్‌లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో బీ1-కేటగిరీ ఇసుక రీచ్‌లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్‌ లేదా లారీల్లో లోడ్‌ చేస్తారు. దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్‌ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 83 బీ1-కేటగిరీ రీచ్‌ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా, 8 జిల్లాల్లో జీసీకేసీ కంపెనీల నియంత్రణలోఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చే శారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 

వాటిని శనివారం రాత్రికల్లా గనుల శాఖకు పూర్తిగా స్వాధీనం చేసినట్లు తెలిసింది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. 

ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్‌, ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకొని వచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ చార్జీలు, ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే రూ.88 ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. 

డిపో పరిధిలో గ్రామ, వార్డు సెక్రటేరియట్ల సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా ఫీజు చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు. ఇదిలాఉంటే, ఉచిత ఇసుక విధానంలో ప్రైవేటు అమ్మకాలను నిషేధించనున్నట్లు తెలిసింది. 

ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబరు వివరాలను జతచేసి డిపో ఇన్‌చార్జి వద్ద ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. గృహ నిర్మాణరంగం, ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు. ఉచితంగా ఇసుక తీసకెళ్లి ప్రైవేటుగా డిపోలు ఏర్పాటుచేసుకొని అమ్మడానికి వీల్లేకుండా నిబంధనలు తీసుకొస్తారు. ఉచిత ఇసుక దుర్వినియోగం కాకుండా, మరోసారి మాఫియా ముఠాలు విజృంభించకుండా వీటిని ప్రతిపాదించినట్లు తెలిసింది.

ఇసుక విధివిధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో ఇసుక లభ్యత, ఉచిత ఇసుక విధానంపై మాట్లాడారు. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలిసింది. రీచ్‌లు, స్టాక్‌పాయింట్లలో తమ నియంత్రణలో ఉన్న ఇసుకను గనుల శాఖకు అప్పగించామని కంపెనీల ప్రతినిధులు నివేదించినట్లు సమాచారం. 

తమ బకాయిలు చెల్లించి కాంట్రాక్టు సెటిల్‌ చేస్తే స్వచ్ఛందంగా తప్పుకుంటామని, ఈ మేరకు ఆ కంపెనీలు లేఖలు సమర్పించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటిని డీఎంజీ పరిధిలోని న్యాయవిభాగం పరిశీలన చేస్తోంది. కాంట్రాక్టు టెర్మినేషనా… లేక కంపెనీలే వైదొలుగుతున్నట్లుగా సెటిల్‌ చేయాలా అనేదానిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.