భారీగా పెరగనున్న జనరల్ కోచ్‌లు

భారీగా పెరగనున్న జనరల్ కోచ్‌లు
భవిష్యత్తులో రైళ్లలో జనరల్‌ కోచ్‌లు భారీగా పెరగనున్నాయి. ఆ దిశగా ప్రత్యేక డ్రైవ్‌ కింద చర్యలు చేపట్టామని కేంద్ర రైల్వేశాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్‌ కింద 2,500 జనరల్‌ కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10 వేల కోచ్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 
 
‘దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా మరో 50 అమృత్‌భారత్‌ రైళ్ల తయారీని ప్రారంభించాం. గతేడాది డిసెంబర్‌లో మాల్దా, దర్బాంగా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రెండు అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించారు. ఇవేకాక మరో 150 అమృత్‌భారత్‌ రైళ్ల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది’ అని తెలిపారు. 
 
ఈ ఏడాది వేసవి రద్దీని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా పదివేల ప్రత్యేక రైళ్లును నడిపామని చెబుతూ  రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. గతేడాది 5,300 కొత్త రైల్వే ట్రాక్‌లను జోడించమని చెబుతూ ఈ ఏడాది కూడా 800 కిలోమీటర్ల పైగా ట్రాక్‌లను జోడిస్తామని రైల్వే మంత్రి తెలిపారు. కవాచ్‌ సిస్టమ్‌ అమలు చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు.
 
కాగా, అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించారు. 2026 నాటికి దేశ తొలి బుల్లెట్ రైలు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అహ్మదాబాద్-ముంబయి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పొడవు 508 కిలోమీటర్లుగా ఉంది. 2028లో పూర్తిస్థాయి విస్తరణ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు.
 
ఇలా ఉండగా, గతేడాది జూన్‌ 2వ తేదీన ఒడిసాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 300 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాల్ని విమర్శించారు. రైల్వే ఉద్యోగులను ప్రతిపక్షాలు నిరుత్సాహ పరుస్తున్నాయని ధ్వజమెత్తారు.  
 
ప్రమాదం జరిగినప్పుడు పాత వీడియోలను సర్క్యులేట్‌ చేసి రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేల్లో ఉన్న చిన్న సమస్యల్ని ప్రతిపక్ష నేతలు పెద్దవి చేస్తున్నారని పేర్కొంటూ ఈ విషయంలో రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే మంత్రి హెచ్చరించారు.