ఏపీలో పెట్టుబడులకు తలుపులు తెరిచిఉంచాం

ఏపీలో పెట్టుబడులకు తలుపులు  తెరిచిఉంచాం
ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడిదారులను వేధించే ప్రభుత్వం ఇప్పుడు లేదని,  పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు తలుపులు బార్లా తెరిచిఉంచామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగిస్తూ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా 10 మంది కేంద్ర మంత్రులను, పలువురు పారిశ్రామిక వేత్తలను కలిసినప్పుడు సానుకూల స్పందన లభించిందని చెప్పారు.
 
నీతి ఆయోగ్‌ సిఇఓ బివిఆర్‌ సుబ్రహ్మణ్యం, 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా తదితరులను కలిశారు. వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, ఎన్‌టిపి సిఎమ్‌డి గుర్దీప్‌ సింగ్‌, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) చైర్మన్‌ సంతోష్‌ యాదవ్‌, డిజిసిఐఐ చంద్రజీత్‌ బెనర్జీ, ఫిక్కీ ఉపాధ్యక్షుడు అనంత్‌ గోయింక, ఫిక్కీ డైరెక్టర్‌ జనరల్‌ జ్వోతి విజ్‌ తదితరులతో ఆయన సమావేశం అయ్యారు.
 
అలాగే సెయిల్‌ డైరెక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌, యూఎస్‌-ఇండియా స్ట్రేటజీ పార్టనర్‌షిప్‌ ఫోరం అధ్యక్షుడు ముకేష్‌ అఘితో భేటీ అయ్యారు.  జపనీస్‌ దౌత్యవేత్త సుజుకీ హిరోషీతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమే తన తన లక్ష్యమని, ఆ దిశగానే తన ఢిల్లీ పర్యటన సాగిందని చెప్పారు.  తమకు పదవులపై ఆశ లేదని, అందుకే కేంద్రపై ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. 
 

వాజపేయి హయాంలో ఏడు కేబినెట్‌ మంత్రి పదవులు ఇస్తామన్నారని, అయినా తీసుకోలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్‌డిఎలో ఉన్నందున అప్పుడు స్పీకర్‌ పదవి తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్‌డిఎ ఇచ్చిన రెండు మంత్రి పదవులే తీసుకున్నామని, ఆ మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామని చెప్పారు. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తామని, పిపిపి నమూనా స్థానంలో పి-4 (పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌, పార్టనర్‌షిప్‌) విధానం తెస్తామని చెప్పారు.  జనవరిలో జరిగే దావోస్‌ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతానని ప్రకటించారు. రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామని, త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు భూతాన్ని వదిలించుకున్నారని, ఆ భూతాన్ని చూసి ఇప్పటికీ పెట్టుబడిదారులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారని పేరోన్నారు. జగన్‌ హయాంలో అమరావతి, పోలవరం సహా రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. అమరావతికి పూర్వ వైభవం తేవడమే లక్ష్యమన్నారు. అమరావతిలో ఐకానిక్‌ బిల్డింగ్స్‌ సహా అన్నీ పూర్తి చేస్తామన్నారు.