మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఆశలు గల్లంతు

లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ ఆశించిన విధంగా సీట్లు గెల్చుకోలేక పోవడం, పైగా బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానంకు నమ్మకం సడలుతున్నట్లు కనిపిస్తున్నది. మంత్రివర్గ విస్తరణకు, నూతన పిసిసి అధ్యక్షుడి నియామకం కోసం గత నెల రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధిష్టానం అనుమతి ఇవ్వడం లేదు.
 
గత నెలరోజులలో సుమారు 10 రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. గత ఏడు నెలల్లో 17 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం మొండిచెయ్యి చూపడం రేవంత్ రెడ్డిని ఖంగారుకు గురిచేస్తున్నది.
 
గురువారం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టుకొని, గవర్నర్ రాధాకృష్ణన్ తో కూడా చర్చించి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఢిల్లీలో తర్వాత చూద్దాంలే అంటూ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కర్ణాటకకు, ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కేరళకు వెళ్లిపోవడంతో దిక్కుతోచలేదు. రేవంత్ రెడ్డి  ఏకపక్ష, ఒంటెద్దు పొకడలను కట్టడి చేసేందుకే మంత్రివర్గ విస్తరణను అధిష్టానం వాయిదా వేస్తున్నట్లు భావిస్తున్నారు. 
 
భారీగా కసరత్తు చేసి కొత్తగా మంత్రులుగా ఎవ్వరిని చేయాలో రేవంత్ తయారు చేసిన జాబితా పట్ల పలువురు సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు. ముందుగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేస్తున్నారు.
 
నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అయినప్పటికీ ఇదే జిల్లా నుంచి వెంకటరెడ్డి సోదరుడు  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును ప్రతిపాదించడాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకించినట్టు తెలిసింది. కోమటిరెడ్డి కుటుంబానికే రెండు మంత్రి పదవులు ఇచ్చే పక్షంలో తన భార్య పద్మావతికి కూడా ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలిసింది. 
 
అలాగే ఆదిలాబాద్‌ నుంచి సీనియర్‌ నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావుకు కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్టు చెప్తున్నారు. దివంగత జీ వెంకటస్వామి కుమారులు వివేక్‌, వినోద్‌కు ఎమ్మెల్యేలుగా, ఆయన మనవడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా వారి కుటుంబానికి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించడాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది.
 
మరోవైపు హైదరాబాద్‌ నగరం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయితే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి శ్రీగణేశ్‌ గెలుపొందినప్పటికీ ఆయనకు కాకుండా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్ఎస్ ఎమ్యెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్‌ పేరును సీఎం ప్రతిపాదించడాన్ని కూడా సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. 
 
ఇలా ఉండగా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కూడా సీనియర్లు అధిష్ఠానం వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. దీనికితోడు మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు కూడా మారనున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించడం, సీతక్కకు హోంశాఖ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పరోక్షంగా వెల్లడించడం సహితం పార్టీలో కలకలం రేపుతోంది. సీనియర్లకు డమ్మీ శాఖలు కట్టబెట్టి ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.