యువమోర్చ కార్యకర్తలలపై లాఠీఛార్జ్ పట్ల ఆగ్రహం

యువమోర్చ కార్యకర్తలలపై లాఠీఛార్జ్ పట్ల ఆగ్రహం
శాంతియుతంగా నిరసనకు దిగిన భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలపై లాఠీచార్జ్ కు పాల్పడి జైలుకు తరలించడాన్ని ఖండిస్తూ  అరెస్ట్ చేసిన నిరుద్యోగులను, బీజేవైఎం కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ డిమాండ్ చేశారు.  ఉద్యోగాల సాధన కోసం టిజిఎస్ పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిని, అసమర్థ ధోరణిని, అవకాశవాదం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల నిరసన దీక్ష జరిగిందని ప్రకటించారు. నిరుద్యోగుల సమస్యలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంపు, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించడం వంటి డిమాండ్లతో నిరుద్యోగులు నిరసన దీక్షకు దిగితే అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు తరలివస్తున్న నిరుద్యోగులను, యువతను భయబ్రాంతులకు గురిచేస్తూ, అక్రమ అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం కార్యకర్తలను, నిరుద్యోగులను అడ్డుకుంటూ క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మహేందర్ మండిపడ్డారు. నిరుద్యోగుల పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకునేలా హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని తెలిపారు.
ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తులు శాశ్వతం కాదని హెచ్చరించారు.  శాంతియుతంగా జరుగుతున్న నిరుద్యోగుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువమోర్చ నేత హెచ్చరించారు.  నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిష్పత్తి 1:100 ప్రకారం ఇవ్వాలని కోరి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ నిష్పత్తిని అమలు చేయకపోవడం దుర్మార్గం అంటూ విమర్శించారు. 
గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయడం లేదే? అని ప్రశ్నించారు.  ఎన్నికల ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని మహేందర్ నిలదీశారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.  విద్యార్థులు, నిరుద్యోగుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగుస్తుందని స్పష్టం చేశారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతను అడ్డుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఫాంహౌస్ కే పరిమితయ్యారని గుర్తు చేశారు. నేడు అదేదారిలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని ధ్వజమెత్తారు.