రెండు రోజుల కిందట నల్గొండ లోని బీఆరెస్ పార్టీ విషయంలోనూ ఇదే తీరుగా ఆరోపణలు రాగా మంత్రి కోమటిరెడ్డి దానిని కూల్చేయాల్సిందుగా ఆదేశించారు. దీంతో హనుమకొండ లోని ఆఫీస్ ను కూడా కూల్చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ జిల్లా ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రెండూ బాలసముద్రంలోని సర్వే నెంబర్ 1066లో నిర్మించారు.
అక్కడ గజం రూ.75 వేలకు పైగానే పలుకుతుండగా, ప్రభుత్వ స్థలం కావడం, అందులోనూ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో గజం కేవలం రూ.100కే ఇచ్చేశారు. అంటే దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కేవలం రూ.4 లక్షలకే అప్పజెప్పినట్లు తెలుస్తోంది. దీంతోనే పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయింపుపై అప్పట్లో వివాదం కూడా చెలరేగింది.
మరోవంక, పార్టీ ఆఫీస్ నిర్మాణ క్రమంలో దానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. అంతేగాకుండా అదంతా బాలసముద్రంలోని వెంచర్ పార్కు స్థలం కాగా, పార్క్ స్థలాన్ని మింగేసి పార్టీ ఆఫీస్ ను నిర్మించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆ పార్టీ ఆఫీస్ బిల్డింగ్ కు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం, నెంబర్ లేకుండా మీటర్లు తిరుగుతుండటం, ఇంతవరకు బిల్లు కట్టిన దాఖలాలు కూడా లేకపోవడం విమర్శలకు కారణమైంది.
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా ఆఫీస్ ను వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో నిర్మించగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన దాస్యం వినయ్ భాస్కర్ ఓటమి చెందగా, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఆనుకునే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను నిర్మించడంతో సమస్య మొదలైంది. క్యాంప్ ఆఫీస్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాగా, దాని పక్కనే బీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
శాశ్వతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అధికారంలో ఉంటారనే భావనతోనే పార్టీ ఆఫీస్ ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలోనే నిర్మించారనే అభిప్రాయాలు వినిపిస్తుండగా, తరచూ ఇబ్బందుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలంలో పార్టీ ఆఫీస్ ను అక్కడి నుంచి తరలించి, వేరే చోట ప్రభుత్వ స్థలం చూపాలని ఆయన అధికారులను కోరారు.
దీంతో హనుమకొండ ఆర్డీవో ఎన్.వెంకటేశ్ ప్రభుత్వానికి చెందిన ఎకరం స్థలంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేయడంతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలు అందించాల్సిందిగా లేఖ రాశారు. దీంతో పర్మిషన్ తీసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలిసింది.
More Stories
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం