పుంగనూరు లో ఉద్రిక్తత… గృహనిర్బంధంలో ఎంపీ మిథున్ రెడ్డి

పుంగనూరు లో ఉద్రిక్తత… గృహనిర్బంధంలో ఎంపీ మిథున్ రెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్నాకు చేపట్టారు. పుంగనూరు, అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ‘మిథున్ రెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లూ పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేదిలేదని కూటమి నాయకులు హెచ్చరించారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎంపీని పర్యటనకు వెళ్లవద్దని చెప్పారు. ఆయన వినకపోవడంతో తిరుపతిలో ఆయనను హౌస్ అరెస్టు చేశారు.  అంతకుముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు  పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 
 ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త ఫ్యాక్షన్ సంస్కృతికి తెర లేపుతున్నారని విమర్శించారు. జేసీబీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తమ వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు నియోజకవర్గంలో తనను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని చెబుతూ ఈ విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెబుతూ  తమకు ఓటు వేసిన 40 శాతం మందిని రాష్ట్రం నుంచి తరిమేస్తారా ? అని ప్రశ్నించారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాము అండగా ఉంటామని చెప్పారు. పార్టీ మారమని తమ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేసి, ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదని హితవు చెప్పారు.  తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.