భారత్ చిరకాల కల నెరవేరింది! అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచకప్ ఎట్టకేలకు మన చెంతకు చేరింది. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది.
ఈ ఘన విజయం సాధించిన భారత జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘ప్రపంచకప్ గెలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. క్లిష్ట పరిస్థితుల్లో టోర్నీ ఆసాంతం జట్టు అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడారు. వెల్ డన్, టీమ్‌ఇండియా’ అంటూ రాష్ట్రపతి ప్రశంసించారు. ‘చాంపియన్స్! టీ20 ప్రపంచకప్‌ను భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. ఈ మ్యాచ్ చరిత్రాత్మకం’ అంటూ ప్రధాని కొనియాడారు.
తొలుత విరాట్ కోహ్ లీ(59 బంతుల్లో 76, 6ఫోర్లు, 2సిక్స్‌లు), అక్షర్‌పటేల్(31 బంతుల్లో 47, ఫోర్, 4సిక్స్‌లు) బ్యాటింగ్‌తో భారత్ తొలుత 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. మహారాజ్, నోకియా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. క్లాసెన్(27 బంతుల్లో 52, 2ఫోర్లు, 5సిక్స్‌లు), డికాక్(39) రాణించారు.
హార్దిక్‌పాండ్యా(3/20) మూడు వికెట్లతో విజృంభించగా, అర్ష్‌దీప్‌సింగ్(2/20), బుమ్రా(2/18) రెండేసి వికెట్లతో సత్తాచాటారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, 15 వికెట్లతో అదరగొట్టిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నది. మెగాటోర్నీలో ఫామ్‌లేమితో సతమతమైన విరాట్ కోహ్లీ ఫైనల్ పోరులో సత్తాచాటాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో మూడు ఫోర్లు బాది తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు.
అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్..టీమ్‌ఇండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. వరుసగా రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన కెప్టెన్ రోహిత్‌శర్మ(9)తో పాటు వికెట్‌కీపర్, బ్యాటర్ పంత్(0)ను వెంటవెంటనే ఔట్ చేసి సఫారీ శిబిరంలో ఆనందం నింపాడు. తొలి రెండు ఓవర్లు ముగిసే సరికి టీమ్‌ఇండియా రెండు కీలక వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. అప్పటికే కష్టాల్లో ఉన్న ఇండియాను రబాడ మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. భారీ షాట్ ఆడబోయిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్(3)..క్లాసెన్ క్యాచ్‌తో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందువచ్చిన అక్షర్‌పటేల్..కోహ్లీకి జతకలిశాడు. ఇక్కణ్నుంచి టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ గాడిలో పడింది. వీరిద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగేసి సరికి భారత్ 3 వికెట్లకు 45 పరుగులు చేసింది.ఓవైపు సహచరులు నిష్క్రమించినా కోహ్లీ పరిణతి కనబరిచాడు. ఇన్నింగ్స్ గాడిలో పడి ఊపందుకుంటున్న తరుణంలో అనవసర పరుగు కోసం ప్రయత్నించిన అక్షర్ కీపర్ డికాక్ డైరెక్ట్ త్రోతో భారంగా పెవిలియన్‌కు వెళ్లాడు. దీంతో నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(27) అడపాదడపా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత బ్యాటు ఝులిపించిన విరాట్ రబాడ 18వ ఓవర్లో ఓ భారీ సిక్స్, ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. అదే ఊపులో జాన్సెన్‌ను అరుసుకుంటూ 19వ ఓవర్లో కోహ్లీ 4, 6 జోరు కనబరిచాడు.
మరో భారీ షాట్ ఆడే క్రమంలో బౌండరీ వద్ద రబాడ క్యాచ్‌తో కోహ్లీ ఔట్ కావడంతో ఐదో వికెట్‌కు 57 పరుగుల పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 20వ ఓవర్ వేసిన నోకియా..దూబే, జడేజా(2)ను ఔట్ చేసి తొమ్మిది పరుగులే ఇచ్చుకోవడంతో టీమ్‌ఇండియా 7 వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌కు తెరపడింది.
భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా సరైన శుభారంభం దక్కలేదు. 12 పరుగులకే ఓపెనర్ హెండ్రిక్స్(4), కెప్టెన్ మార్క్మ్(4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఓవైపు సహచరులు నిష్క్రమించినా..డికాక్ పోరాటాన్ని నమ్ముకున్నాడు. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది.
ఇంగ్లండ్‌తో గత మ్యాచ్‌లో విజృంభించిన స్పిన్నర్లు అక్షర్‌పటేల్, కుల్దీప్‌యాదవ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. 13వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన డికాక్..కుల్దీప్ క్యాచ్‌తో ఔటయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 24 ఫోర్లతో దుమ్మురేపాడు. మ్యాచ్ పూర్తిగా చేజారిందన్న తరుణంలో హార్దిక్..క్లాసెన్‌తో పాటు మిల్లర్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మన వైపునకు తిప్పాడు.
More Stories
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు