లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా

లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా
లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సభాపతిగా మరోసారి ఓం బిర్లానే గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు.
 
సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు.  మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేశ్‌ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు.
అనంతరం స్పీకర్‌ పదవికి ఎన్నిక చేపట్టారు. ప్రతిపక్షాలు ఓట్ల లెక్కింపుకు పట్టుబట్టగా పోవడంతో మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు.  స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు. అనంతరం ఓంబిర్లాను మోదీ, రాహుల్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సాదరంగా సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత ఐదేళ్లలో సభను విజయవంతంగా నడిపిన అనుభవం మీకు ఉందని తెలిపారు. బలరామ్ జాఖర్ తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదని, పోటీలో మీరు గెలిచి నిలిచారని ప్రశంసించారు. వచ్చే ఐదేళ్లూ సభ్యులకు మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. సభను నడిపించడంలో స్పీకర్‌ది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు.

అటు, ఇండియా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలని, సభను సజావుగా నడిపించడంలో విపక్షం మీకు సహకరిస్తుందని చెప్పారు. ఇక, గతంలో నీలం సంజీవరెడ్డి, ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, జీఎంసీ బాలయోగిలు రెండుసార్లు లోక్‌సభ స్పీకర్లుగా ఉన్నా పూర్తికాలం ఐదేళ్లు పదవిలో కొనసాగలేదు.

స్పీకర్‌ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వాలన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్‌ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. 

ఇండియా కూటమి తరఫున సీనియర్‌ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ బరిలో నిలిచారు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగింది. రాజస్థాన్‌లోని కోటా పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎన్నికైన ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ సభాపతి పదవిని చేపట్టారు. 

లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన రెండో వ్యక్తి ఓం బిర్లా. అంతకు ముందు బలరామ్ జాఖడ్ ఒకరు మాత్రమే వరుసగా రెండుసార్లు స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన 1980 జనవరి నుంచి 1989 డిసెంబరు వరకూ (ఏడు, ఎనిమిదో లోక్‌సభ) స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు