వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వాఖ్యలు ఈ సందర్భంగా కలకలం రేపుతున్నాయి. అందుకే బెంగళూరుకు వెళ్లారని, డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపారని ఆయన ఆరోపించారు.
అయితే అందుకోసం ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న తన సోదరి వైఎస్ షర్మిలను పార్టీ నుండి బైటకు పంపాలని ఓ షరతు విధించినట్లు ఆయన చెబుతున్నారు. తన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే వైఎస్సార్సీపీని విలీనం చేస్తానని జగన్ అన్నట్లు నల్లమిల్లి వెల్లడించారు.
అయితే లోక్ సభ స్పీకర్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి ఓం బిర్లాకు వైసిపి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. ముగ్గురు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. మరో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా ప్రమాణస్వీకారం చేయకపోవడంతో వెంటనే చేసి, స్పీకర్ ఎన్నికల్లో పాల్గొనాలని వర్తమానం పంపడంతో ఆయన బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటున్నారు.
ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని, అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని బిజెపి ఎమ్యెల్యే తెలిపారు. ప్రస్తుతం గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా జగన్ మోహన్ రెడ్డితో ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. చివరికి రాజ్యసభ సభ్యులు కూడా ఆయనతో ప్రయాణం చేస్తారో లేదో తెలియదని పేర్కొన్నారు.
అందుకే దిక్కుతోచని స్థితిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారని ఆరోపించారు. వైఎస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ కనీసం పులివెందుల వైపు చూడలేదని ఎద్దేవా చేశారు.
“2019 నుంచి 2024 వరకూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ అప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ప్రజలంతా కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. దీని ద్వారా తెలుస్తోంది ఏంటంటే, నియంత పాలనను ప్రజలు ఎప్పుడూ కూడా ఆమోదించరని స్పష్టంగా అర్ధం అవుతోంది” అని బిజెపి ఎమ్యెల్యే చెప్పుకొచ్చారు.
“అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్నటి రోజున కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే, తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధం అని తెలిపారు” అంటూ ఆయన తెలిపారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు