రష్యాలో ఉగ్రదాడి.. పోలీసులు సహా 15 మందికి పైగా మృతి

రష్యాలో ఉగ్రదాడి.. పోలీసులు సహా 15 మందికి పైగా మృతి
రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. చర్చిలు, యూదుల ప్రార్థనమందిరం, పోలీసుల పోస్టుపై సాయుధులైన మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసుల పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.  దీంతో 15 మందికి పైగా చనిపోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నారని డాగేస్థాన్‌ గవర్నర్‌ సెర్గీ మెలికోవ్‌ వెల్లడించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.  పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
 
కాగా, భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మఖచ్‌కల, డెర్బెంట్‌ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్‌ ముగిసినట్లు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీనిని ఉగ్రవాదుల చర్యగా ప్రకటించింది.
 
కాగా, డాగేస్థా చర్చిపై జరిగిన దాడిలో ఒక ఫాదర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారని ఓ అధికారి వెల్లడించారు. చర్చిలో హత్యకు గురైన ఫాదర్‌ను 66 ఏండ్ల నికోలాయ్‌గా గుర్తించామన్నారు. అలాగే చర్చికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారని తెలిపారు.  ఈ ఉగ్రవాద దాడి అనంతరం యూదుల ప్రార్థనా స్థలంలో మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. 
 
గవర్నర్ మెలికోవ్ వీడియో ప్రకటనలో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని పరిస్థితి చట్ట అమలు, స్థానిక అధికారుల నియంత్రణలో ఉందని, ఉగ్రవాదుల “అన్ని స్లీపింగ్ సెల్స్” వెలికితీసే వరకు దాడుల దర్యాప్తు కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేశారు. ఎటువంటి ఆధారాలు చూపకుండానే  దాడులకు విదేశాల నుండి పధకం వేసి ఉండవచ్చని పేర్కొన్నారు.  ఉక్రెయిన్‌లో “ప్రత్యేక సైనిక చర్య” అని క్రెమ్లిన్ పిలిచే దానితో దాడులను లింక్ చేయడానికి స్పష్టమైన ప్రయత్నం చేశారు.
 
గత మార్చిలో, మాస్కోలోని సబర్బన్‌లోని ఒక కచేరీ హాల్‌లో ముష్కరులు గుంపుపై కాల్పులు జరిపారు, 145 మంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది, అయితే రష్యా అధికారులు కూడా ఎటువంటి ఆధారాలు అందించకుండా దాడికి ఉక్రెయిన్‌కు లింక్ చేయాలని ప్రయత్నించారు. కైవ్ అటువంటి ప్రమేయాన్ని తీవ్రంగా ఖండించారు.
 
డాగెస్థాన్‌లో జూన్‌ 24, 25, 26 తేదీల్లో సంతాప దినాలుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని జాతీయ ఉగ్రవాద నిరోదక కమిటీ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండడంతో గతంలో కాల్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి.