టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును  టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. ఇక కోశాధికారిగా దగ్గుమల్ల ప్రసాద్‌ను నియమించడం జరిగింది. 

లావు నరసారావుపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలవగా, శబరి తొలిసారి గెలిచారు. ఈ ఇద్దరూ కూడా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారే. ఇక దగ్గుమల్ల ప్రసాద్ చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఆయన  రాధే కన్‌స్ట్రక్షన్స్ నడిపిస్తున్నారు.

కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌ను నియమించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలసేపు కొనసాగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.

ఈసారి లోక్‌సభలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు సూచించారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ఎంపీలు అందరూ ఉండాలని, ఏ మాత్రం సందేహాలున్నా సరే వెంటనే తనకు తెలియజేయాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎంపీలకు చంద్రబాబు చెప్పారు.

‘పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకొని పనిచేయాలి. అమరావతిని ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడకు తరలిరావడానికి ప్రయత్నం చేయాలి. పోలవరం కూడా జగన్‌ విధ్వంస పాలనకు బలైంది. దానిని కూడా పూర్తి చేయాలి. రాష్ట్రం నలుమూలలకూ నీరివ్వాలి. మీ శక్తిని అంతటిని వీటికి వాడండి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.