తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌

తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌
రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతం ప‌రిధిలోని తాడేప‌ల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని శ‌నివారం తెల్ల‌వారు జామున కూల్చివేయడం  ప్రారంభించారు. ప్రారంభ‌మైయ్యాయి. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) అధికారులు కూల్చివేస్తున్నారు. శ్లాబ్ వేయ‌డానికి సిద్ధంగా ఉన్న భ‌వ‌నాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెల్ల‌వారు జామున 5.30 గంట‌ల నుంచి భారీ పోలీసులు బందోబ‌స్తు మ‌ధ్య కూల్చి వేత‌లు ప్రారంభించింది.
 
బుల్డోజ‌ర్లు, పొక్లెయిన‌ర్లను ఉప‌యోగించి భ‌వ‌న కూల్చివేత ప‌నులు మొద‌లు పెట్టారు. బ్రిటిష్ హయాంలో ఇరిగేషన్ శాఖ స్థలంలో బోటు యార్డ్ ఏర్పాటు చేసింది. ఈ బోట్ యార్డ్ వద్దే పడవలకు మరమ్మతులు చేసి జల రవాణా చేస్తోంది. ఈ స్థలంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీళ్లు కల్పించేందుకు ప్లాంట్ పెడతానని ప్రభుత్వానికి అప్పటి మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు.
దానితో ఈ స్థలం గురించి తెలుసుకున్న వైసిపి పెద్దలు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేసే ప్రయత్నం జరిపారు. జగన్ పాలనలో అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజుతో కైవసం చేసుకున్నారు. ఉండవల్లిలోని బోట్ యార్డ్ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం లీజుకి జగన్ సర్కార్ కట్టబెట్టింది. అప్పట్లో టిడిపి, జనసేన తీవ్ర అభ్యంతరం తెలిపాయి. 
 
వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు తాడేప‌ల్లిలోని రెండు ఎక‌రాల్లో పార్టీ కార్యాల‌యం నిర్మాణం ప్రారంభించారు. అయితే నిర్మాణం అక్ర‌మం అంటూ ఇటీవ‌లి సీఆర్‌డీఏ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనిపై కూల్చివేత‌కు సీఆర్‌డీఏ త‌యారు చేసిన ప్రాథ‌మిక ప్రొసీడింగ్స్‌ను స‌వాల్ చేస్తూ వైసీపీ శుక్ర‌వారం హైకోర్టును ఆశ్ర‌యించింది. దీన్ని విచారించిన హైకోర్టు చ‌ట్టాన్ని మీరి వ్య‌వ‌హ‌రించొద్ద‌ని సీఆర్‌డీఏని ఆదేశించింది. 
తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు. సీఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్సార్‌సీపీకి అప్పగించలేదని చెబుతున్నారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదంటున్నారు అధికారులు. నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారంటున్నారు.
కాగా,  హైకోర్టు ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ త‌మ పార్టీ కార్యాల‌యాన్ని కూల్చివేస్తూ కూట‌మి ప్ర‌భుత్వం కోర్టు ధిక్కర‌ణ‌కు పాల్ప‌డ్డార‌ని వైసీపీ ఆరోపించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ కోర్టు ధిక్కారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామ‌ని తెలిపింది. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేటంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు.ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని జగన్ ఆక్షేపించారు.  ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదని, వెన్నుచూపేది అంతకన్నా లేదని స్పష్టం చేశారు.
“ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు.” అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.