మోదీ ప్రభుత్వంలో ఏడుగురు మహిళా మంత్రులు

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా 72 మంది మంత్రులతో  ఏర్పాటు చేసిన కొత్త కేబినెట్‌లో ఏడుగురు మహిళా మంత్రులున్నారు. గత ప్రభుత్వంలో పది మంది మహిళా మంత్రులు ఉంటే, ఈసారి ఏడుగురికి తగ్గడం గమనార్హం. ఇక గత ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన ఐదుగురికి మళ్లీ కొత్త కేబినెట్‌ చోటు దక్కింది. ఇద్దరు మాత్రం తొలిసారి మంత్రి పదవులు దక్కాయి.

గతంలో ఆర్థిక, రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహించిన నిర్మలాసీతారామన్‌కి కొత్త కేబినెట్‌లో మరోసారి మంత్రి పదవి దక్కింది. జార్ఖండ్‌లోని కోడెర్మా ఎంపీగా రెండుసార్లు గెలిచిన అన్నపూర్ణ దేవి కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె గత ప్రభుత్వంలో విద్యాశాఖా సహాయ మంత్రిగా పనిచేశారు.

ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షపార్టీ అయిన అప్నాదళ్‌ (సోనీలాల్‌) పార్టీ అధినేత్రి అనుప్రియా పటేల్‌కి కూడా మంత్రి పదవి దక్కింది. ఈమె ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె మోదీ  మొదటిసారి ప్రధాని అయినప్పుడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండో ప్రభుత్వ హయాంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఆసహాయ మంత్రిగా ఉన్నారు.

మహారాష్ట్ర బిజెపికి చెందిన మరో సీనియర్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సేకి మంత్రి పదవి దక్కింది. ఆదివారం ఈమె కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె గతంలో సర్పంచ్‌గా, జిల్లా పరిషత్‌ సభ్యురాలిగా కూడా పనిచేశారు.

కర్ణాటక నుంచి రెండుసార్లు బిజెపి ఎంపీగా గెలిచిన శోభా కరంద్లాజే కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. ఈమె గత ప్రభుత్వంలో కూడా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పరిశ్రమలు, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. ఈమె 2024 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ఎంపీ స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన సావిత్రి ఠాకూర్‌ కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో ఈమెకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి.
మధ్యప్రదేశ్‌లోని భావ్‌నగర్‌ ఎంపీగా నిముబెన్‌ భంబనియా (57) కూడా తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమెకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి.