పాక్ ప్రధాని అభినందనలు.. మోదీ ధీటైన సమాధానం

వరుసగా మూడవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సోమవారం అభినందనలు తెలియజేశారు. ‘భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు’ అని షరీఫ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ , మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్  పంపిన అభినందన సందేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ధీటుగా బదులిచ్చారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సమయంలో భారత్ వైఖరిని మరోసారి విస్పష్టంగా తెలియజేశారు. భారతదేశం ఎప్పుడూ శాంతి, ప్రగతినే కోరుకుంటుందని, భారత ప్రజల భద్రత అనేది ఎప్పుడూ తమ ప్రాధాన్యతా క్రమంలో ముందుంటుందని స్పష్టం చేశారు.

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను దాటటంతో పలు ప్రపంచ దేశాలు మోదీకి అభినందనలు తెలిపాయి. అయితే పాక్ మాత్రం ఇందుకు దూరంగా ఉండిపోయింది. కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనందున ముందస్తుగా అభినందనలు తెలియజేయలేమంటూ గతవారం పాక్ సాకులు వెతికే ప్రయత్నం చేసింది. 

ఈ క్రమంలో పాక్ మినహా ఇరుగుపొరుగు దేశాలకు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పిలుపులు వెళ్లాయి. ఆదివారంనాడు మరోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడంతో చైనాలో పర్యటన ముగించుకున్న షెహబాజ్ ఎట్టకేలకు మోదీకి అభినందన సందేశం పంపారు.  ఆ వెనువెంటనే నవాజ్ షరీఫ్ కూడా అభినందన సందేశం పంపుతూ, మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారనడానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రశంసించారు. ఇదే సమయంలో విద్వేషం స్థానంలో ఆశావహ దృక్పథం నెలకొంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇందుకు నరేంద్ర మోదీ దీటుగా స్పందించారు. భారత్ ఎప్పుడూ శాంతి, అభ్యుదయాన్నే కోరుకుంటుందని, భారత ప్రజల భద్రత అనేది ఎప్పటికీ తమ ప్రాధాన్యతాక్రమాల్లో ఒకటిగా ఉంటుందని విస్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శనివారం అనిశ్చిత ప్రకటన నేపథ్యంలో ఈ అభినందన సందేశం వచ్చింది. ప్రధాని మోదీని అభినందిస్తున్నారా? అన్న ప్రశ్నకు బలోచ్ ‘వారి ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. పైగా, కొత్త భారత ప్రభుత్వం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనందున అభినందన సందేశాలపై చర్చించడం ‘తొందరపాటు’ అవుతుందని ఆమె పేర్కొన్నారు. 

‘భారత్‌తో సహా తన పొరుగు దేశాలతో సహకార సంబంధాలను పాకిస్తాన్ ఎల్లప్పుడూ వాంఛిస్తుంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రధాన వివాదంతో సహా అన్ని పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలను మేము సూచిస్తూనే ఉన్నాం’ అని బలోచ్ తెలిపారు.