ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ నేతలకు గవర్నర్ ఆహ్వానం

ఎన్డీఏ కూటమి నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌  ను కలిశారు. సభా నాయకుడిగా చంద్రబాబు నాయుడును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం గవర్నర్‌కు అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున అచ్చెన్నాయుడు, బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ గవర్నర్​ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందజేశారు.

164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చారు ఎన్డీయే కూటమి నేతలు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు.

కృష్ణా జిల్లా కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తవగా.. చిన్న చిన్న పనులను సైతం పూర్తి చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు విచ్చేయనున్నారు. 

ప్రముఖుల రాక దృష్ట్యా భద్రత పెంచారు. విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ఎయిర్​పోర్టు అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. రేపు ఉ.10 నుంచి సా.4 వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు.  అయితే, ప్రయాణికుల విమానాలన్నీ యథాతథంగా నడుస్తాయని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు ఉ.9.30లోపే విమానాశ్రయం చేరుకోవాలని ఆయన సూచించారు.